ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన విజయవంతంగా ముగించుకుని భారత్ చేరుకున్నారు. ఫ్రాన్స్, యూఏఈ, బహ్రెన్ దేశాలతో ద్వైపాక్షిక చర్చలు ఫలప్రదంగా ముగించారు. బీయరజ్ పట్టణంలో జరిగిన జీ-7 సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
జీ-7 సదస్సులో ప్రపంచనేతల ముందు పలు కీలక అంశాల్లో భారత వాణిని సమర్థంగా వినిపించారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రత్యేకంగా భేటీ అయి భారత్‌కు కశ్మీర్‌పై మరో దౌత్య విజయాన్ని అందించారు.
ట్రంప్‌ను ఒప్పించారు...
ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ తరుణంలో జమ్ము-కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం చేస్తానంటూ పదేపదే ప్రకటించిన ట్రంప్‌తో.. కశ్మీర్ వ్యవహారంలో మూడో దేశం జోక్యం అక్కర్లేదని తెగేసి చెప్పేలా చేశారు మోదీ.
జమ్ముకశ్మీర్ అంశం సహా భారత్-పాకిస్థాన్ మధ్య అనేక ద్వైపాక్షిక అంశాలున్నాయని వాటిని తమ రెండు దేశాలు చర్చల ద్వారా..పరిష్కరించుకుంటాయని తేల్చి చెప్పారు. ఈ అంశంలోకి... మూడోదేశాన్ని లాగి ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం తమకు లేదన్నారు.
యూకే ప్రధానితో...
యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌తో సమావేశమైన ప్రధాని మోదీ పలు కీలక అంశాలలో పరస్పర సహకారంపై చర్చించారు. వాణిజ్యం,పెట్టుబడులు రక్షణ, విద్య, శాస్త్రసాంకేతిక రంగాలలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.
ఆంటోనియో గుటెరస్‌తో...
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌తో మోదీ భేటీ అయ్యారు. ఐరాసలో వాతావరణ మార్పులపై జరిగే సదస్సుకు హాజరవడం సహా పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.
- ఇదీ చూడండి: జీ-7 సదస్సు: ప్రపంచ అగ్రనేతలతో మోదీ చర్చలు
ప్లాస్టిక్‌పై పోరు...
జీ-7 సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ పర్యావరణ పరిరక్షణకు భారత్ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. పునర్వినియోగానికి పనికిరాని ప్లాస్టిక్‌ను భారతావని నుంచి తొలగించేందుకు తీసుకోనున్న చర్యలను పేర్కొన్నారు. నీటి సంరక్షణ, సౌరశక్తి వినియోగం, వృక్ష- జంతు సంపదను కాపాడుకునేందుకు అనుసరిస్తున్న విధానాలను సమగ్రంగా జీ-7 దేశాల ముందుంచారు.
బహ్రెయిన్‌లో...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహ్రెయిన్ విశిష్ట పురస్కారం 'ది కింగ్ హమాద్ ఆర్డర్ ఆఫ్ రెనాయిసన్స్'తో గౌరవించింది ఆ దేశ ప్రభుత్వం. భారత ప్రధాని బహ్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
- ఇదీ చూడండి: ప్రధాని మోదీకి బహ్రెయిన్ విశిష్ట పురస్కారం
యూఏఈలో పౌరపురస్కారం...
యూఏఈ అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ జాయేద్'ను స్వీకరించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మోదీ కృషికి గాను.. యూఏఈ ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది. యూఏఈ యువరాజు మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు.
తేల్చి చెప్పిన ఫ్రాన్స్...
మూడు దేశాల పర్యటనలో భాగంగా ముందుగా ఫ్రాన్స్ వెళ్లిన మోదీకి కశ్మీర్‌పై తొలి అడుగులోనే విజయం వరించింది. ఆర్టికల్ 370 రద్దుపై స్పందించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు.. ఇది పూర్తిగా భారత్-పాక్ ద్వైపాక్షిక అంశమేనని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్. ఇదే అంశంపై పాక్ ప్రధానితోనూ మాట్లాడతానన్నారు మెక్రాన్.