ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారికి మందు కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యాయి. తను కూడా ఔషధాన్ని కనిపెడతానంటూ ఓ ప్రైవేట్ ఫార్మసిస్టు రంగంలోకి దిగాడు. అనుకున్నదే తడవుగా నెల రోజుల పాటు శ్రమించి ఓ మందును తయారు చేశాడు. ఆ మందు పని తీరును తెలుసుకునేందుకు ముందుగా తనపైనే ప్రయోగించుకున్నాడు. కానీ ఆ ఔషధం వికటించి విగతజీవిగా మిగిలాడు. ఈ ఘటన చెన్నైలో జరిగింది.
ఇదీ జరిగింది.
తమిళనాడు పెరుంగుడికి చెందిన శివనేసన్ ఉత్తరాఖండ్‌లోని ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో ప్రొడక్షన్ మెనేజర్. ఔషధాల తయారీలో ఆయన కీలక పాత్ర పోషించేవాడు. ఆ సంస్థ యాజమాన్యం అతడిని చెన్నై కొడంబక్కం భూపతి నగర్లో ఉన్న శాఖలో విధులు నిర్వర్తించేందుకు పంపించింది.
కరోనా మహమ్మారికి తను కూడా ఔషధాన్ని కనిపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుని తయారు చేయటం ప్రారంభించాడు శివనేసన్. కొన్ని నెలల పాటు సాగిన తన ప్రయత్నంలో పురోగతి సాధించినట్లు అందరికీ తెలియజేశాడు.
తను తయారు చేసిన ఔషధాన్ని పరీక్షించటం కోసం చెన్నై తైనాంపేట్లో ఓ వైద్యుడి వద్దకు వెళ్లాడు. ఆ మందును తనపైనే ప్రయోగించుకున్నాడు. కొంత సమయం తర్వాత శివనేసన్ అకస్మారక స్థితికి వెళ్లటాన్ని గమనించిన ఆ వైద్యుడు.. వెంటనే ఒమాండురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఔషధం కోసం ఉపయోగించిన సోడియం నైట్రేట్ వల్ల శివనేసన్ మరణించి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు.