అధికరణ 370 రద్దు నేపథ్యంలో నిర్బంధించిన జమ్ముకశ్మీర్ నేత, పీడీపీ అధ్యక్షురాలు మోహబూబా ముఫ్తీని ఎట్టకేలకు విడుదల చేశారు. జమ్ముకశ్మీర్ ప్రభుత్వ ప్రతినిధి రోహిత్ కంసాల్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ముఫ్తీ విడుదలపై ఆనందం వ్యక్తం చేశారు ఆమె కుమార్తె ఇల్తిజా. 'మా అమ్మను చివరికి విడుదల చేశారు. తనకు మద్దతుగా ఉన్నవారికి కృతజ్ఞతలు' అని ట్వీట్ చేశారు.
'ముఫ్తీని ఏడాదికిపైగా నిర్బంధంలో ఉంచడం ప్రజాస్వామ్య సిద్ధాంతాలను అపహాస్యం చేయడమే' అని ట్వీట్ చేశారు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.
14 నెలలు..
ఒకప్పటి జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి మొదటి మహిళ ముఖ్యమంత్రిగా పని చేశారు ముఫ్తీ. గతేడాది ఆగస్టు 5న రాజ్యాంగంలోని 370 అధికరణ రద్దు నేపథ్యంలో అల్లర్లు జరుగుతాయని భావించిన కేంద్ర ప్రభుత్వం... కొన్ని గంటల ముందు ముఫ్తీతో సహా పలువురు నాయకులను నిర్బంధించింది. అనంతరం ముఫ్తీపై వివాదాస్పద ప్రజా భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. తొలుత చశ్మా షాహీ గెస్ట్ హౌస్లో ముఫ్తీని బంధించగా... అనంతరం ఫిబ్రవరి 6న అధికారిక నివాసానికి తరలించారు. తిరిగి ఏప్రిల్ 7న జైలుకు పంపారు.
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాను మార్చిలోనే విడుదల చేశారు.