మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్-ఎన్సీపీతో చేతులు కలిపి అధికారాన్ని చేజిక్కించుకున్న శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. ప్రభుత్వ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తక్కువ పరిధి నుంచి ఎలా ఎదగాలి, ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉన్నా ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది శరద్ పవార్ నేర్పించారని పేర్కొన్నారు.
పుణెలోని వసంత్‌దాదా సుగర్ ఇన్స్టిట్యూట్ వార్షిక సాధారణ సమావేశానికి హాజరైన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఠాక్రే. అత్యధిక స్థానాలు సాధించి.. అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించిందన్న మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా అధికారాన్ని చేపట్టలేకపోయారని ఎద్దేవా చేశారు ఠాక్రే.
మోదీపై వ్యంగ్యస్త్రాలు..
కొన్ని సంవత్సరాల క్రితం ఇదే సంస్థ ప్రాంగణంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోదీ.. శరద్ పవార్ వేలు పట్టుకునే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పటంపై వ్యంగ్యాస్త్రాలు సందించారు ఠాక్రే. అయితే తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చి పవార్ సాహెబ్ మరో తప్పుచేశారని తాను అనబోనంటూ పరోక్షంగా మోదీపై వ్యంగ్య బాణాలు విసిరారు.
సుగర్ ఇన్స్టిట్యూట్ వార్షిక సమావేశానికి సంస్థ ఛైర్మన్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.
ఇదీ చూడండి: 'పౌర' నిరసనలపై యూపీ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు