సంస్థానాల విలీనాన్ని సమర్థంగా పూర్తి చేసిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జన్మదినాన్ని (అక్టోబరు 31) ‘జాతీయ సమైక్యతా దినం’గా జరుపుకొంటున్నాం! నిబ్బరంగా నిర్ణయాలు తీసుకోవటం పటేల్ ప్రజ్ఞకు తార్కాణం. మొక్కవోని ఆయన దృఢ సంకల్పానికి దర్పణం పట్టే ఓ రెండు ఘటనలు తెలుసుకుందాం.
అంత నొప్పినీ.. మత్తు లేకుండానే..!
వల్లభ్‌భాయ్ పటేల్‌కు కాలిలో విపరీతమైన పోటుతో ఒకసారి తీవ్రమైన జ్వరం వచ్చింది. కాల్లో నారి కురుపు చేరిందంటూ వైద్యులు అప్పటికే రెండుసార్లు శస్త్రచికిత్సలు చేశారు. చివరికి మొత్తం కాలే తీసేయాల్సి రావచ్చన్నారు. వైద్యులు మత్తు మందు ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే ప్రయోజనం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వెంటనే పటేల్ రెండో ఆలోచనే లేకుండా ‘‘ఎంత బాధ అయినా భరిస్తాను. నాకు మత్తుమందు అవసరమే లేదు’ అంటూ తక్షణం శస్త్రచికిత్సకు సిద్ధమైపోయారు. పటేల్ ధైర్యం చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. చివరికి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.
భార్య మరణాన్నీ దిగమింగుకొని..
పటేల్ ఒకసారి ఓ హత్య కేసును కోర్టులో బలంగా వాదిస్తున్నారు. ఇంతలో బంట్రోతు ఆయనకు టెలిగ్రాం తెచ్చి ఇచ్చారు. ఒకవైపు వాదిస్తూనే దాన్ని చటుక్కున చదివేసి, మడిచి జేబులో పెట్టుకుని వాదనలు కొనసాగించారు పటేల్. కోర్టు ముగిశాక న్యాయవాది ఒకరు దగ్గరకు వచ్చి ‘ఆ టెలిగ్రాం ఏమిటని’ ఆరా తీశారు. అది తన భార్య చనిపోయినట్లు వచ్చిన వర్తమానమని పటేల్ స్థిరంగా బదులిచ్చారు. అది విన్న వాళ్లంతా ఒక్కసారిగా నిశ్చేష్టులైపోయారు. భార్య చనిపోయిన విషయం తెలిసీ వాదనలు ఎలా కొనసాగించారని ప్రశ్నించారు. దానికి పటేల్- ‘‘మరేం చెయ్యాలి? ఆమె ఎలాగూ చనిపోయారు. నేనామెను బతికించలేను. వాదనలను మధ్యలోనే వదిలేస్తే ఈ ముద్దాయిని కూడా చంపినట్లవదూ?’’ అని గంభీరంగా సమాధానమిచ్చారు.
ఇదీ చూడండి : 'కమలం'పై ఉమ్మడి పోరుకు కాంగ్రెస్ కసరత్తులు!