వేల సంఖ్యలో మాస్కులు, చేతి తొడుగులు.. వందల సంఖ్యలో శానిటైజర్ బాటిళ్లు, ముఖ కవచాలు.. చేతితో తాకకుండానే తెరుచుకునే తలుపులు.. పార్లమెంటు సభ్యులు, సిబ్బంది సహా 4 వేల మందికిపైగా కరోనా పరీక్షలు.. సభలోకి తీసుకొచ్చే ప్రతి పత్రానికి శుద్ధి.. ఇలా ఎన్నెన్నో జాగ్రత్తల మధ్య ఈ నెల 14వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కరోనా నేపథ్యంలో దాదాపు 18 రోజుల పాటు నిర్వహించనున్న సభల కోసం గతంలో ఎన్నడూ లేనటువంటి ముందస్తు జాగ్రత్తలతో విస్త్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పార్లమెంటు ప్రాంగణంలోని అణువణువు, లోపలికి ప్రవేశించే కార్లు మొదలుకుని సభ్యుల పాదరక్షల వరకు అన్నింటిని తరకూ శానిటైజ్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. భౌతిక దూరం నిబంధనలను కచ్చితంగా పాటించేందుకు గాను లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు రెండు వేర్వేరు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. దీనికి అనుగుణంగా సభ్యుల సిట్టింగ్ ఏర్పాట్లు ఉండనున్నాయి. పార్లమెంటు ప్రాంగణం మొత్తాన్ని సురక్షితమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు లోక్‌సభ సభాపతి ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు.. కేంద్ర హోం, ఆరోగ్య మంత్రిత్వశాఖల అధికారులతో పాటు ఐసీఎంఆర్, డీఆర్డీఎఓ అధికారులతో విస్తృత సమాలోచనలు జరిపి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
4 వేల మందికి పరీక్షలు..
పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనే సభ్యులతో పాటు రెండు సభల సచివాలయాల సిబ్బంది, విలేకరులు అందరూ సభల ప్రారంభ తేదీకి 72 గంటలో ముందే కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను దాదాపు 4 వేల మందిని పరీక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కిట్లు..
ఉభయ సభలకు వచ్చే ప్రతి సభ్యునికి బహుళ ఉపయోగకరమైన కిట్లను డీఆర్డీఓ అందజేయనుంది. ప్రతి కిట్‌లో 40 డిస్పోజబుల్ మాస్కులు, 5 ఎన్95 మాస్క్‌లు, 50 మిల్లీ లీటర్ల శానిటైజర్ బాటిళ్లు 20, ముఖకవచాలు, 40 జతల చేతి తొడుగులు, హెర్బల్ శానిటేషన్ రుమాళ్లు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే టీ బ్యాగులు ఉంటాయి.
ఎదురుపడే అవకాశమే లేకుండా..
ప్రస్తుతం ఉభయ సభల్లో కలిపి 730 మంది సభ్యులున్నారు. పార్లమెంటు ప్రాంగణంలో వీరు సంచరించే సమయంలో ఒకరికొకరు ఎదురు పడకుండా ఉండేలా మార్గ సూచీలు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. దీని ప్రకారం సభ్యులందరూ ఒకే దిశ నుంచి వెళ్లటం కానీ రావటం కానీ చేయాల్సి ఉంటుంది.
మరిన్ని..
- పార్లమెంటు ప్రధాన భవనంలోకి మంత్రులు ఎంపీలను మాత్రమే అనుమతిస్తారు. వారి వ్యక్తిగత సిబ్బందికి ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాట్లు ఉంటాయి.
- ఉభయ సభల్లోనూ సభ్యులందరూ భౌతిక దూరాన్ని పాటించేలా సిట్టింగ్ ఏర్పాట్లు ఉంటాయి. మాస్కు ధరించిన వారు తమ స్థానంలో కూర్చొనే సభపతిని ఉద్దేశించి మాట్లాడవచ్చు.
- సభ్యులకు అందజేసే పత్రాలను శద్ధి చేసేందుకు అల్ట్రావయొలెట్ బాక్సులను ఉపయోగించనున్నారు.
- సభాప్రాంగణంలోని ఏసీల ద్వారా వైరస్ వ్యాపించకుండా చేసేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
- మార్షల్ మాస్కులతో పాటు ముఖ కవచాలనూ ధరించడం తప్పనిసరి చేసింది.
- కరోనా సోకకుండా ఎంపీలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరించే వీడియో క్లిప్పులను అందుబాటులో ఉంచనున్నారు.
- పార్లమెంటు ప్రాంగణంలో 40 చోట్ల చేతితో తాకనవసరం లేని శానిటైజర్లను ఏర్పాటు చేస్తున్నారు.
- డోర్ మ్యాట్లను వైరస్‌ను హతమార్చే హైపోక్లోరైడ్ జెల్‌తో శుద్ధి చేస్తారు.
- అత్యవసర వైద్య సిబ్బంది, అంబులెన్సులు సిద్ధంగా ఉంటాయి.