వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లుపై చర్చించడానికి ఏర్పాటైన పార్లమెంటు సంయుక్త కమిటీ(జేసీపీ) ఎదుట ఈ నెల 28న హాజరయ్యేందుకు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ నిరాకరించింది. భేటీకి గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని ప్యానెల్ ఛైర్‌పర్సన్, భాజపా ఎంపీ మీనాక్షి లేఖి తెలిపారు. నిర్దేశిత సమయానికి అమెజాన్ నుంచి ఏ ఒక్కరూ సమావేశానికి హాజరు కాకపోతే సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సిఫారసు చేస్తామని హెచ్చరించారు.
దీనిపై అమెజాన్ ప్రతినిధులు స్పందించారు. తమ తరఫున హాజరవ్వాల్సిన సమాచార పరిరక్షణ నిపుణులు విదేశాల్లో ఉన్నారని వివరించారు. కొవిడ్ నేపథ్యంలో వారు భారత్‌కు రావడం కష్టమని తెలిపారు. అమెజాన్ సమాధానంపై కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్‌లో పెద్దస్థాయిలో మార్కెట్ కలిగి ఉన్న సంస్థకు ఇక్కడ సమాచార పరిరక్షణ నిపుణులే లేరా? అని ప్రశ్నించింది. ఫేస్‌బుక్ తరఫున అంకిదాస్ శుక్రవారం ప్యానెల్ ముందు హాజరయ్యారు. కమిటీ సభ్యులు ఆమెను సుమారు రెండు గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ నెల 28న ట్విటర్, 29న పేటీఎం, గూగుల్ సంస్థలను తమ ఎదుట హాజరు కావాలని కమిటీ సమన్లు జారీ చేసింది.