వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు దేశంలోని అత్యున్నత సైనిక పురస్కారం పరమవీరచక్ర ప్రకటించాలని కోరారు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి. ఈమేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అభినందన్ అమితమైన నిబ్బరం ప్రదర్శించారని పళనిస్వామి కితాబిచ్చారు.
పాక్ సైన్యానికి చిక్కి మార్చి 1న స్వదేశానికి చేరిన అభినందన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి.
త్రివిధ దళాల్లో సేవలు అందిస్తూ అసాధారణ ధైర్య సాహసాల్ని ప్రదర్శించినవారికి పరమవీర చక్ర అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. భూతలం, సముద్రం, గగనతలాల్లో వీరోచితంగా పోరాడి అసువులు బాసినా ఈ అవార్డు ప్రకటిస్తారు.
ఫిబ్రవరి 27న భారత గగనతలంలోకి చొరబడ్డ పాక్ యుద్ధ విమానాల్ని అభినందన్ మిగ్-21 ఫైటర్ జెట్‌తో నిలువరించారు. పొరుగు దేశంతో జరిగిన పోరులో ఆయన నడుపుతున్న యుద్ధ విమానం కూలింది. పారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగిన ఆయన్ను ఆ దేశ సైన్యం అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ ఒత్తిళ్లతో వెనక్కి పంపింది.