అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసుపై సుప్రీం కోర్టు శనివారం చారిత్రక తీర్పు వెలువరించింది. అయితే.. తీర్పు వెలువరించటంపై పాకిస్థాన్ తన అక్కసును వెళ్లగక్కింది. కర్తార్‌పుర్ నడవా ప్రారంభం రోజున అయోధ్య కేసు తీర్పు వెలువరించిన పట్ల పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ అసహనం వ్యక్తం చేశారు. సిక్కు సమాజానికి పాక్ చేసిన సహాయాన్ని కప్పిపుచ్చడానికే చేశారని ఆరోపించారు.
'తీర్పు ఎందుకు ఈ రోజు వెలువడింది. ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన సమయం. సిక్కు సమాజానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన చారిత్రక సహాయ ప్రాముఖ్యాన్ని తగ్గించారు. ఎంతో సంతోషకర సమయంలో ఇలాంటిది జరిగినందుకు బాధగా ఉంది. అయోధ్య తీర్పు ద్వారా న్యాయాన్ని నిలబెట్టడంలో భారత సుప్రీంకోర్టు విఫలమైంది.'-షా మహ్మద్ ఖురేషీ, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి.
పాక్వి అసమంజస వ్యాఖ్యలు: భారత్
పాకిస్థాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పుబట్టింది. పాక్ వ్యాఖ్యలు వారి మానసిక రుగ్మతను తెలియజేస్తున్నాయని తిప్పికొట్టింది. భారత పౌరులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో పాకిస్థాన్ అసంమంజసమైన, అర్థరహితమైన వ్యాఖ్యలు చేసిందని... ఇది పూర్తిగా భారత అంతర్గత విషయమని స్పష్టం చేశారు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్.
'ఇది చట్టానికి సంబంధించింది. అన్ని వర్గాల విశ్వాసాలకు చట్టం సమాన గౌరవం ఇస్తుంది. ఇది వారి నైతిక విలువలకు సంబంధంలేనిది. వారి అవగాహనరాహిత్యానికి ఆశ్చర్యపోనక్కర్లేదు. విద్వేషాలు సృష్టించడానికే భారత అంతర్గత విషయాల్లో పాక్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.'-రవీశ్ కుమార్, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి.
విదేశీ దౌత్యవేత్తలకు వివరణ
అయోధ్య విషయంలో సుప్రీం వెలువరించిన తీర్పును పలు దేశాల దౌత్యవేత్తలకు వివరించారు భారత అధికారులు. కేసు పూర్వాపరాలు సహా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సారాంశాన్ని వారికి తెలియజేశారు. దక్షిణతూర్పు ఆసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఐరోపా సహా గల్ఫ్ దేశాల అధికారులు ఇందులో పాల్గొన్నారు. పూర్తిగా అంతర్గత విషయమైనప్పటికీ...ఇతర దేశాలతో సమాచారం పంచుకున్నందుకు భారత విదేశాంగ శాఖను అభినందిస్తున్నట్లు తెలిపారు రష్యా దౌత్యాధికారి డన్నెంన్బర్గ్ కాస్టెల్లనోస్.
ఇదే విధంగా ఆర్టికల్-370 రద్దు అంశంపై భారత్ తీసుకున్న నిర్ణయాలను ఆగష్టులో ఐరాస భద్రత మండలి శాశ్వత సభ్యదేశాలకు వివరించింది.