టీవీ యాంకర్లు తమ సొంత అభిప్రాయాలు బయటపెట్టకూడదని పరిమితులు విధించింది పాక్. ఈ మేరకు వార్తా ఛానల్ యాజమాన్యాలకు.. పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పెమ్రా) ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ సొంత లేదా ఇతర ఛానెళ్ల టాక్ షోలలో విశ్లేషకులుగా కనిపించవద్దని యాంకర్లను ఆదేశించింది.
అభిప్రాయాలు రుద్దకూడదు..
పెమ్రా ప్రవర్తనా నియమావళి ప్రకారం ఛానెళ్లలో కార్యక్రమాలను నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించడం మాత్రమే యాంకర్ల పాత్ర అని.. అంతకుమించి తమ సొంత అభిప్రాయాలను రుద్దకూడదని హెచ్చరించింది.
టాక్ షోలలో అతిథులను చాలా జాగ్రత్తగా, నిర్దిష్ట అంశాలకు సంబంధించి వారి జ్ఞానం, నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంచుకోవాలని సూచించింది.
పాక్ వర్సెస్ షాబాజ్ షరీఫ్ విషయంలో అక్టోబర్ 26న ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పుపై.. టీవీ వ్యాఖ్యాతలు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి న్యాయవ్యవస్థ నిర్ణయాన్ని అపహాస్యం చేయడానికి ప్రయత్నించారన్న విమర్శల నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీచేసింది పెమ్రా.
అనవసర చర్చలెందుకు?
అక్టోబర్ 26న కొన్ని టీవీ ఛానళ్లు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఇచ్చిన బెయిల్ విషయంలో వ్యాఖ్యాతలు వ్యవహరించిన తీరును గమనించినట్లు చెప్పింది ఇస్లామాబాద్ హైకోర్టు(ఐహెచ్‌సీ). అనుచిత చర్చలు జరిపి, వివాదాస్పదం చేయడం వల్ల సమగ్రత సన్నగిల్లుతోందని ఐహెచ్‌సీ తెలిపింది.
పెమ్రా (సవరణ) చట్టం, 2007 ఆర్డినెన్స్ 2002 సెక్షన్ల ప్రకారం ఇలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం సుపీరియర్ కోర్టుకు ఉంటుందని మీడియా సంస్థలను హెచ్చరించింది పెమ్రా.