కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.83లక్షలకు పైగా ఖాళీలున్నాయని తెలిపారు కేంద్ర వ్యయశాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్. ఉద్యోగాల భర్తీపై ఆర్థికశాఖ నివేదకను బుధవారం దిగువసభలో సమర్పించారు. వివిధ శాఖల్లో 38,02,779 పోస్టుల భర్తీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. అందులో 31,18,956 ఖాళీలు భర్తీ అయ్యాయని నివేదికలో పేర్కొన్నారు. 2018 మార్చి 1నాటికి దేశవ్యాప్తంగా 6,83,823 ఉద్యోగ ఖాళీలున్నాయని వివరించారు.
కేంద్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలని ఇటీవల మంత్రిత్వ శాఖలు కోరగా.. వ్యయశాఖ సహాయ మంత్రి ఈ నివేదికను లోక్సభలో సమర్పించారు.
రైల్వేలోనే 1.16లక్షల పోస్టులు...
2019-20 ఆర్థిక సంవత్సరంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు 1.34లక్షల పోస్టులకు సిఫార్సు చేశాయి. అందులో అత్యధికంగా రైల్వే బోర్డు ద్వారా 1,16,391 పోస్టులకు.. ఎస్ఎస్సీకి 13,995, యూపీఎస్సీకి 4,399 ఖాళీలకు సిఫార్సులు అందాయి. ఇంకా మిగిలిన 27,652 ఖాళీలతో సహా పోస్టల్ విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ 3,10,832 పోస్టులను భర్తీచేసే పనిలో ఉన్నాయని తెలిపారు జితేంద్రసింగ్.
ఇదిలా ఉంటే ఉద్యోగాల భర్తీని వేగవంతం చేసేందుకు, నియామక ప్రక్రియ కాలపరిమితిని తగ్గించేందుకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించడం, నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: చీమలు గీసిన రూపం.. 'చిండీ మాత' ఆలయం!