కరోనా మృతుల అంత్యక్రియలు అడ్డుకోవడం అమానవీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. చెన్నై, మేఘాలయల్లో జరిగిన ఘటనలు దురదృష్టకరమని అన్నారు. వీటిపై సామాజిక చైతన్యం తీసుకురావాలని సూచించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన... ఈ మేరకు సూచనలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వంతో వ్యవహరించాలని ప్రజలను కోరారు.
వైద్యుడిగా సేవలందిస్తూ కరోనా బారిన పడి.. చెన్నైలో మృతిచెందాడు నెల్లూరుకు చెందిన ఓ డాక్టర్. అతడి మృతదేహాన్ని మొదట ఎలక్ట్రిక్ శ్మశాన వాటికలో దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే స్థానికులు అడ్డుకోగా, ఆ తర్వాత అంబత్తూరు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలోనూ మళ్లీ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి ఘటనలు అమానవీయమని వెంకయ్యనాయుడు అన్నారు. పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది చొరవతీసుకుని వేరేచోట అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం దారుణమన్నారు.
మేఘాలయలోనూ స్థానిక ప్రముఖ వైద్యుడి మృతదేహానికి అంత్యక్రియలకు స్థానికులు అడ్డుతగిలారు. ఈ విషయంపైనా ఉపరాష్ట్రపతి స్పందించారు. ఆ వైద్యుడు చనిపోయిన 36 గంటలపాటు అంత్యక్రియలకు జరగకుండా ఆపడం.. అధికారులు, వైద్య సిబ్బందిపైనా స్థానికులు నిరసన వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలు తనకు ఆవేదన కలిగించాయన్నారు. చివరకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకునేంతవరకు అంత్యక్రియలు జరకగపోవడం అమానుషమన్నారు.
పార్టీ, ప్రాంతం, కులం, మతాలకు అతీతంగా వ్యవహరించాల్సిన సమయంలో ఇలాంటి ఘటనలు మానవత్వానికే మచ్చగా ఆయన అభివర్ణించారు. కరోనా బాధితుల మృతదేహాల విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను.. అందరూ పాటించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: లాక్డౌన్ వేళ 'కరోనా విందు'- ఒకరు అరెస్ట్