అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు తీర్పును విపక్షాలు స్వాగతించాయి. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయా పార్టీల నేతలు పిలుపునిచ్చారు.
రామమందిర నిర్మాణానికి అనుకూలమే..
అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును స్వాగతిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది.
సుప్రీం తీర్పును గౌరవిస్తూ.. పరస్పర సామరస్యంగా మెలగాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
కలిసి మెలిసి జీవనం సాగించే భారతీయ ఐక్యతా సంస్కృతిని పరిరక్షించాల్సిన బాధ్యత అన్ని వర్గాలపై ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలమేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా స్పష్టం చేశారు.
"అయోధ్య కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారత జాతీయ కాంగ్రెస్ స్వాగతిస్తోంది. రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక విలువలు, సోదరభావాలకు కట్టుబడి ఉండాలని, శాంతి, సామరస్యాలను కొనసాగించాలని సంబంధిత పక్షాలకు, వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. యుగయుగాలుగా మన సమాజం నిర్వచిస్తోన్న పరస్పర గౌరవం, ఐక్యతలను పునరుద్ఘాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది." -రణ్‌దీప్ సుర్జేవాల కాంగ్రెస్ అధికార ప్రతినిధి
చారిత్రక తీర్పును అందరూ గౌరవించాలి..
సుప్రీం ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు దేశం ముందు ఉన్న సంక్లిష్టమైన అంశానికి పరిష్కారం చూపేందుకు ఉపకరిస్తుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విశ్వాసం వ్యక్తం చేశారు. సమాజంలో అన్ని వర్గాలూ కోర్టు తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని పవార్ అభిప్రాయపడ్డారు.
"ఈ తీర్పు ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలు పరిరక్షణను ప్రస్తావించడం ఆహ్వానించదగిన పరిణామం. చారిత్రక తీర్పును అన్ని వర్గాలు స్వాగతించడం సహా గౌరవించాలని కోరుతున్నాను. శాంతి, సౌభ్రాతృత్వాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను." -శరద్ పవార్, ఎన్సీపీ అధినేత
దశాబ్ధాల వివాదానికి నేటితో ముగింపు..
సుప్రీం తీర్పుపై తదుపరి చర్యలు తీసుకునేలా సామరస్యపూర్వకంగా వాతావరణం ఉండేలా చూడాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి పిలుపునిచ్చారు. అయోధ్య తీర్పును స్వాగతించిన ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. దశాబ్దాల నాటి వివాదానికి నేటితో ముగింపు పడిందని పేర్కొన్నారు. సుప్రీం తీర్పు సమతుల్యమైన నిర్ణయంగా జేడీఎస్ అధినేత దేవేగౌడ అభివర్ణించారు.