పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖలు రాసిన సీనియర్ నేతలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేడు భేటీ కానున్నారు. పార్టీ రాజ్యసభ పక్షనేత గులాం నబీ ఆజాద్, ఉపసభాపక్ష నేత ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ, వివేక్ తన్ఖా, శశిథరూర్, మాజీ ముఖ్యమంత్రులు భూపిందర్ హుడా, పృథ్వీరాజ్ చవాన్లతో సోనియా సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్, సీనియర్ నేత చిదంబరం సైతం ఇందులో భాగం కానున్నట్లు వెల్లడించాయి. రాహుల్ గాంధీ ఈ చర్చకు హాజరవుతారని స్పష్టం చేశాయి.
'కలిసే ఉన్నాం'
అయితే ఈ భేటీ అసంతృప్త నేతలతో నిర్వహిస్తున్నది కాదని కాంగ్రెస్ పేర్కొంది. పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు చెప్పుకొచ్చింది.
నేతలంతా ఒకే కుటుంబ సభ్యుల్లా ఐక్యంగానే ఉన్నారని, పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన తర్వాత విభేదాలేవీ తలెత్తలేదని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. పార్టీని నడిపించేందుకు రాహుల్ గాంధీనే సరైన నాయకుడని అన్నారు.
"ఇది అసంతృప్తులను, రెబల్స్‌ను కలిసేందుకు నిర్వహించే సమావేశం కాదు. ఓ ప్రత్యేక బృందంలోని నేతలతో సమావేశం నిర్వహించడం లేదు. మేమంతా కుటుంబంలా కలిసే ఉన్నాం. ఆ పోస్టుకు(అధ్యక్ష పదవికి) ఎవరు సరిపోతారో ఏఐసీసీ సభ్యులు, ఎలక్టోరల్ కాలేజీ, కాంగ్రెస్ కార్యకర్తలు నిర్ణయిస్తారు. 99.9 శాతం నేతలు, కార్యకర్తలు రాహుల్ గాంధీనే పార్టీ నాయకుడిగా ఎన్నుకుంటారని నాకు పూర్తి విశ్వాసం ఉంది."
-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రతినిధి
మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎలాంటి బెరుకు లేకుండా రాహుల్ ప్రశ్నిస్తున్నారని సుర్జేవాలా అన్నారు. ఆయన చాలా అరుదైన నేత అని అభివర్ణించారు. పార్టీని రాహుల్ గాంధీనే ముందుండి నడిపించాలని అభిప్రాయపడ్డారు.