బుల్బుల్ తుపాను ముంచుకొస్తోంది. ఈ రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో బంగాల్లో తీరం దాటనుంది. ఆ సమయంలో తీరం వెంబడి గంటకు 120 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముంది. ప్రస్తుతం తీర ప్రాంతాలైన పారాదీప్‌కు తూర్పు ఈశాన్యంలో 95 కిలోమీటర్ల దూరంలో.. బాలసోర్‌కు 140 కిలోమీటర్ల దూరంలో 'బుల్బుల్' తుపాను కేంద్రీకృతమై ఉందని భువనేశ్వర్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఒడిశా, బంగాల్ రాష్ట్రాల్లో ఇప్పటికే తుపాను ప్రభావం ఉంది. భారీ వర్షాల వల్ల బంగాల్లో ఒకరు మృతి చెందారు. అనేక చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అధికారులు అప్రమత్తం...
తుపాను నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం పట్నాయక్ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాలు కురుస్తోన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. బంగాల్లోని లోతట్టు, తీర ప్రాంతాల్లోని గ్రామాలు, చిన్నచిన్న ద్వీపాల నుంచి సుమారు 18 లక్షల మందిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.
తీర, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో ఇప్పటి వరకు 3000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
బుల్బుల్ పరిస్థితిని జాతీయ విపత్తు నిర్వాహక కమిటీ (ఎన్సీఎమ్సీ) ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రజల క్షేమం కోసం తగిన చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేసింది.
విమాన రాకపోకలు నిలిపివేత
తుపాను ముంచుకొస్తున్న తరుణంలో తూర్పు భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే కోల్‌కతా విమానాశ్రయాన్ని మూసివేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల పాటు విమానాశ్రయంలో కార్యకలాపాలను నిలిపివేయనున్నట్టు హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.