దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఈ నేపథ్యంలో కరోనా బాధితులు, ఇతర రోగులను వేరుచేయడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది దిల్లీ ప్రభుత్వం. 10-49 పడకలు ఉన్న నర్సింగ్ హోంలను పూర్తిగా కరోనా బాధితుల చికిత్స కోసం వినియోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు నేషనల్ కాపిటల్ టెరిటరీ(ఎన్సీటీ) ఆఫ్ దిల్లీకి ఆదేశాలు జారీ చేసింది.
"చిన్న, మధ్యస్థ మల్టీస్పెషాలిటీ నర్సింగ్ హోమ్స్‌లోని కరోనా బాధితులు, ఇతర రోగులను వేరుచేయడం కోసం, ఎన్సీటీ పరిధిలోని అన్ని నర్సింగ్ హోమ్స్(10-49 పడకల సామర్థ్యం)లను ప్రత్యేకంగా కరోనా రోగుల చికిత్స కోసమే వినియోగించాలి. కరోనా రోగుల చికిత్స కోసం పడకలను పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది."
-- దిల్లీ ప్రభుత్వం.
ఆదేశాలు జారీ చేసిన నాటి నుంచి మూడు రోజుల్లోగా అమలు చేయాలను స్పష్టం చేసింది ప్రభుత్వం. లేదంటే నిబంధనలు ఉల్లఘించినట్టు అవుతుందని, చర్యలు చేపడతామని హెచ్చరించింది.
కంటి, ఈఎన్టీ, డయాలసిస్ కేంద్రాలు, ప్రసూతి గృహాలు, ఐవీఎఫ్ కేంద్రాలకు తాజా నిర్ణయం నుంచి మినహాయింపును ఇచ్చింది ప్రభుత్వం.
ఇదీ చూడండి:- ఒక్కరోజు మరణాల్లో 'మహా'ను మించిన దేశ రాజధాని