సంయుక్త ప్రవేశ పరీక్ష (జేఈఈ)- మెయిన్స్‌ను మంగళవారం నిర్వహించేందుకు జాతీయ పరీక్ష ఏజెన్సీ (ఎన్టీఏ) సర్వం సిద్ధం చేసింది. పరీక్షల నిర్వహణపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో అభ్యర్థులకు సహకారం అందించాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ కోరారు.
"ప్రస్తుత అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. పరీక్ష నిర్వహించే సంస్థలపైనా విద్యార్థులకు విశ్వాసం ఉండాలి."
- రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. కేంద్రం మాత్రం పరీక్షల నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పరిస్థితుల నడుమ పరీక్ష రాసే అభ్యర్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తామని మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి.
8.58 లక్షల మంది అభ్యర్థులు..
ఐఐటీ, ఎన్ఐటీతోపాటు కేంద్రం నిధులు సమకూర్చే సాంకేతిక సంస్థలు (సీఎఫ్టీఐ)ల్లో ప్రవేశాల కోసం జేఈఈని నిర్వహిస్తారు. దీనిని సెప్టెంబర్ 1-6 మధ్య నిర్వహించనున్నారు. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)ను సెప్టెంబర్ 13న జరగనుంది.
జేఈఈ కోసం 8.58 లక్షల మంది, నీట్ కోసం 15.97 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.
భౌతిక నిబంధనలను అనుసరించి..
- కరోనా పరిస్థితుల కారణంగా పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ పకడ్బందీ ప్రణాళికను రూపొందించింది.
- పరీక్షా కేంద్రాలను పెంచి, ప్రత్యామ్నాయ సీటింగ్ ప్లాన్‌ను తయారు చేసింది.
- ఒక గదిలో కొంతమంది మాత్రమే కూర్చునేలా నిబంధనలు ఏర్పాట్లు చేసింది.
- ఈ పరీక్షలను షిఫ్టుల వారీగా నిర్వహించనున్నారు. ప్రతి షిఫ్టు తర్వాత కంప్యూటర్లు, కీబోర్డులు, కుర్చీలను శానిటైజ్ చేస్తారు.
- పరీక్షా కేంద్రాల్లో హాండ్ శానిటైజర్‌ను అందుబాటులో ఉంచుతారు. అడ్మిట్ కార్టుల తనిఖీకి బదులుగా బార్కోడ్ రీడర్లను ఏర్పాటు చేశారు.
- విద్యార్థులు మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా వెంటతెచ్చుకోవాలి. హాల్‌కి వెళ్లిన తర్వాత పరీక్ష నిర్వాహకులు ఇచ్చే మాస్కులను ధరించాలి.
వాయిదాకు ప్రతిపక్షాల డిమాండ్..
నీట్, జేఈఈ పరీక్షలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రం ఇప్పటికే తేల్చిచెప్పగా.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి లేఖ కూడా రాశారు.
ఇదీ చూడండి: 'నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించడమే సరైన నిర్ణయం'