కరోనా వైరస్ వ్యాపించకుండా సామాజిక దూరం పాటించడం మంచిదే. కానీ, ఆ దూరం ఎదుటి వ్యక్తి మనోభావాలు దెబ్బతీసేలా ఉంటేనే ప్రమాదమని తమిళనాడులో రుజువైంది. కరోనా సోకిందంటూ పదే పదే అనుమానించి సంపూర్ణ ఆరోగ్యవంతుడైన వ్యక్తి మరణానికి కారణమయ్యారు ఓ కాలనీవాసులు.
అర్థం లేని అనుమానంతో..
ముస్తఫా ఓ వలస కూలీ. దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు రెండు వారాల ముందే కేరళ నుంచి తమిళనాడుకు వచ్చేశాడు. అప్పటి నుంచి మధురైలోని సోదరి ఇంట్లో ఉంటున్నాడు. గత రెండు రోజులుగా ముస్తఫాకు కాస్త జ్వరంగా ఉందని ఇంట్లోనే ఉండిపోయాడు.
అయితే, ముస్తఫా అస్వస్థతకు గురయ్యాడని తెలుసుకున్న స్థానికులు అతడికి కరోనా సోకిందని చెవులు కొరుక్కున్నారు. వైరస్ తమ అందరికి అంటిస్తాడంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ముస్తఫాతోపాటు అతడి తల్లినీ అంబులెన్స్‌లో కాకుండా ఓ మినీట్రక్కులో స్థానిక రాజాజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కరోనా పరీక్షలు జరిపించారు. ముుస్తఫా శరీరంలో కరోనా వైరస్ లేదని తేల్చారు వైద్యులు.
దీంతో ఆ రోజు రాత్రి తిరిగి ఇంటికి చేరుకున్నాడు ముస్తఫా. అయినా, అనుమానపు కాలనీవాసులు ముస్తఫాను వేధించడం మానలేదు. అర్థరాత్రి 2గంటలకు ముస్తఫాను ఇంటి నుంచి తరిమే ప్రయత్నం చేశారు. పోలీసుల రాకతో వారి దౌర్జన్యం విఫలమైంది. తరువాతి రోజు ఉదయం ముస్తఫాను మరోసారి ఆసుపత్రికి తీసుకెళ్లారు స్థానికులు. వైద్యులు మళ్లీ పరీక్షించి కరోనా లేదని మరోసారి నిర్ధరించారు.
ఆధారాలు లేని అనుమానాలతో అవమానించినందుకు... తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు ముస్తఫా. మరుసటి రోజు గూడ్స్ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు.
ఎంపీ స్పందన..
కరోనా నిందల వల్ల ఓ వ్యక్తి మరణించడం బహుశా దేశంలో ఇదే తొలిసారి అంటూ మధురై పార్లమెంట్ సభ్యుడు ఎస్ వెంకటేశన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ముస్తఫాను అంబులెన్స్‌లో కాకుండా ఓ ట్రక్కులో ఎందుకు తీసుకెళ్లారని పోలీసులను ప్రశ్నించారు. కొందరు సామాజిక దూరం పేరుతో మనుషులను వెలివేస్తున్నరనీ, ఒకవేళ వైద్యులు కూడా అలాగే అనుకుంటే మనకు కరోనా వస్తే ఎవరు చికిత్స చేస్తారంటూ నిలదీశారు.
ఇదీ చదవండి:ఫోన్ కోసం మడుగులోకి దిగి నలుగురు చిన్నారులు మృతి