మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన, భాజపా పట్టువీడట్లేదు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీతో సమావేశమైన భాజపా నేతలు...భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతున్నందున చట్టపరమైన అంశాలపై గవర్నర్‌తో చర్చించినట్లు వెల్లడించారు. మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, సీనియర్ నాయకుడు సుధీర్ ముంగంటివార్ గవర్నర్‌ను కలిసిన ప్రతినిధుల బృందంలో ఉన్నారు.
ఠాక్రేదే అంతిమ నిర్ణయం
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని శివసేన ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు అప్పగించారు. అధికారంలో సమాన వాటా ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
భాజపాతో పొత్తు తెంచుకోవాలని తాను భావించడం లేదని..లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇరుపార్టీల మధ్య కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఈ సమావేశం అనంతరం శివసేన ఎమ్మెల్యేలను ముంబయిలోని ఒక హోటల్‌కు తరలించినట్లు సమాచారం.
'రాష్ట్రపతి పాలన పరిస్థితులు'
మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటును భాజపా ఆలస్యం చేస్తూ రాష్ట్రపతి పాలన తరహా పరిస్థితులను కల్పిస్తోందని శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శించారు. శివసేన వైఖరిలో ఏ మాత్రం మార్పులేదని స్పష్టం చేశారు.
త్వరలో కొత్తప్రభుత్వం..
దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోనే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. శివసేన మద్దతు తమకు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ పార్టీతో మంతనాలు జరుపుతున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ఆర్ఎస్ఎస్ అధినేత పాత్ర లేదని తేల్చి చెప్పారు. తన పేరు ముఖ్యమంత్రి పదవి రేసులో వినిపించడంపై మాట్లాడిన గడ్కరీ..మహారాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదన్నారు. కేంద్రంలోనే తాను ఉంటానన్నారు.
ఇదీ చూడండి: రోడ్డుపై 'వెండి వర్షం'.. ఎగబడ్డ జనం