కొవిడ్‌ను కట్టడి చేసే ప్రయత్నాల్లో భాగంగా బృహన్ ముంబయి నగరపాలక సంస్థ వినూత్న కార్యక్రమానికి తెర లేపింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా కనపడిన వారికి జరిమానా విధిస్తోంది. ఫైన్ కట్టేందుకు విముఖత చూపిస్తే వారిని సమాజ సేవకులుగా మార్చేస్తుంది. చేతికి చీపురు వీధులు శుభ్రం చేయిస్తోంది.
ముంబయిలోని అంధేరీ, జుహా, వర్సోవా పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తోంది. ఈ నిర్ణయాన్ని 'చెత్త నుంచి సంపద తయ్యారీ' చట్టాల మేరకే అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కొవిడ్ కట్టడికి మాస్క్ ఎంతో అవసరం. దీన్ని కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. వారికి జరిమానా విధిస్తున్నాము. అందుకు ఒప్పుకోని వారి చేత నగరంలోని రోడ్లను శుభ్రం చేయిస్తున్నాం. మొదట చాలా మంది ఇందుకు ప్రతిఘటించారు. ఇదే విషయం పోలీసులుకు చెప్తే వారు దారిలోకి వచ్చారు. కొంతమంది తప్పు అని గ్రహించి వెంటనే చేస్తున్నారు. ఇప్పటికి 35 మంది వరకు ఇందులో భాగం అయ్యారు. వీధులను శుభ్రపరచడం అనేది మున్సిపల్ చట్టాలకు లోబడే చేస్తున్నాం.
-విశ్వాస్ మోతే, అసిస్టెంట్ కమిషనర్(బీఎంసీ)
బీఎంసీ ఇప్పటికే భౌతిక దూరం, మాస్క్ పెట్టుకోవడం వంటివాటిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మాస్క్ లేకపోతే బస్సుల్లో, ఆటోల్లో ఎక్కించుకోకూడదనే నిబంధన తీసుకువచ్చింది.