ఉత్తర్‌ప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రియాంక గాంధీకి కల్పించే భద్రతలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని సీఆర్పీఎఫ్ స్పష్టంచేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, స్కూటీపై వెళ్లడం ద్వారా ప్రియాంకనే నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిపింది.
శనివారం ప్రియాంక పర్యటన వివాదాస్పదమైన నేపథ్యంలో ఈమేరకు ప్రకటన విడుదల చేసింది సీఆర్పీఎఫ్.
"ఎలాంటి భద్రత అధికారి లేకుండా బుల్లెట్‌ప్రూఫ్ లేని వాహనంలో ప్రయాణించారు. స్కూటీపై వెనుక ఎక్కి కూర్చున్నారు. ఇలాంటి భద్రతా లోపాలను వారికి తెలియజేశాం. ముందుగానే భద్రతాపరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించాం."
-సీఆర్పీఎఫ్
గతంలో ప్రియాంకకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండేది. ఇటీవల జరిగిన మార్పులతో ఆమెకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తోంది.
ప్రియాంక స్కూటీ ప్రయాణం
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేసి అరెస్టయిన మాజీ ఐఏఎస్ అధికారి కుటుంబాన్ని కలవడానికి డిసెంబర్ 28న ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూకు వచ్చారు ప్రియాంక గాంధీ. పోలీసులు అడ్డుకోవడం వల్ల ఓ సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్త స్కూటీపై ప్రయాణించారు. నిర్లక్ష్య డ్రైవింగ్ సహా హెల్మెట్ ధరించనందుకు ఈ స్కూటీ యాజమానికి పోలీసులు జరిమానా విధించారు.
ఇదీ చదవండి: 'భూత్ బంగ్లా' బురారీ హౌస్‌లోకి కొత్త కుటుంబం