నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయనుందనే ఊహాగానాల నేపథ్యంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని రాజీవ్ వెల్లడించారు. ప్రైవేటు పెట్టుబడులు, వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం ద్వారా ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని స్పష్టం చేశారు. రాబోయే వంద రోజుల్లో నూతన సంస్కరణలు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు రాజీవ్.
2018-19 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 5.8 శాతంగా నమోదై ఐదేళ్ల కనిష్ఠానికి చేరిందని కేంద్ర గణాంక కార్యాలయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజీవ్‌కుమార్ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
దేశంలోని 14.5 కోట్లమంది రైతులందరికీ 'ప్రధానమంత్రి కిసాన్' పథకాన్ని వర్తింపజేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు రాజీవ్. ప్రభుత్వ చర్య గ్రామీణ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆయుర్వేదంలోనూ సంస్కరణలు
ఆయుర్వేద ఔషధాల తయారీలో మరిన్ని పరిశోధనలకు వనరులను పెంచాలని అభిప్రాయపడ్డారు రాజీవ్‌కుమార్. సంప్రదాయ ఔషధాల తయారీకి జాతీయ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి, నూతన నిబంధనలను తీసుకురావాలని యోచిస్తున్నామని వెల్లడించారు. ఆయుర్వేద ఔషధాల ఎగుమతుల్లో నాణ్యతను పెంచే చర్యలను తీసుకోవాల్సిన అవసరముందన్నారు రాజీవ్.