ఎప్పుడెప్పుడా అని యావత్ దేశం ఎదురుచూస్తోన్న నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. మరణశిక్షను తప్పించుకోవడానికి దోషులు వేయని ఎత్తులు లేవు.. వాడని పిటిషన్లు లేవు. ఎట్టకేలకు అన్ని దారులు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల్లో ఒకడి భార్య కోర్టు బయట హైడ్రామాకు తెరలేపింది.
దోషుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ భార్య పునీతా దేవి ఉదయం దిల్లీ పటియాలా హౌస్ కోర్టుకు హజరైంది. దోషులకు ఏ కోర్టులోనూ ఎటువంటి పిటిషన్లూ పెండింగ్‌లో లేవని కోర్టుకు తెలియజేశారు అధికారులు. ఇది అయిన కాసేపటికే అక్షయ్ భార్య కోర్టు బయట కూర్చొని ఏడుపు మొదలు పెట్టింది. తన చెప్పుతో తానే కొట్టుకుంటూ నాకు న్యాయం చేయండి అంటూ రోదించి స్పృహ తప్పి పడిపోయింది.
"నాకూ న్యాయం కావాలి. నన్ను చంపేయండి. నాకు బతకాలని లేదు. నా భర్త అమాయకుడు. ఎందుకు ఈ సమాజం మమ్మల్ని ద్వేషిస్తోంది. మాకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఇన్నాళ్లూ ఉన్నాం. కానీ ఏడేళ్లుగా మమ్మల్ని రోజూ చంపుతూనే ఉన్నారు." - అక్షయ్ భార్య
అటు మరో డ్రామా...
ఉరిశిక్ష నుంచి తప్పించడానికి తన భర్తతో విడాకులిప్పించాలని అక్షయ్ భార్య నిన్న బిహార్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై నేడు విచారణ జరగాల్సి ఉండగా ఆమె కోర్టుకు హాజరుకాలేదు.
పిటిషన్‌దారు లేని కారణంగా బిహార్ కోర్టు విచారణను మార్చి 24కు వాయిదా వేసింది. హత్యాచారం చేసిన వ్యక్తికి వితంతువుగా జీవించలేనంటూ నిన్న పిటిషన్ దాఖలు చేసిన ఆమే.. నేడు తన భర్త అమాయకుడని చెప్పడం గమనార్హం.
ఇదీ చూడండి: నిర్భయ దోషులకు ఉరి తప్పదు... సుప్రీం కీలక వ్యాఖ్యలు