దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దిల్లీ హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది. దోషులకు ఉరి అమలుపై స్టే విధిస్తూ.. దిల్లీ పటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన వ్యాజ్యంపై తీర్పు ఇవ్వనుంది.
దోషుల ఉరిపై ఉన్న స్టేను కొట్టివేయాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై గత శని, ఆదివారాల్లో ప్రత్యేకంగా విచారణ చేపట్టిన జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈనెల 2కు తీర్పును వాయిదా వేసింది. ఈ విషయంపై అందరి వాదనలు విన్న తర్వాతే తీర్పును వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
పలుమార్లు వాయిదా..
నిర్భయ దోషుల మరణ శిక్ష అమలుపై ట్రయల్ కోర్టు జనవరి 7న డెత్ వారెంట్ జారీ చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు శిక్ష అమలు చేయాలని పేర్కొంది. కానీ.. దోషుల్లో ఒకరి క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న సందర్భంగా తొలిసారి ఉరి వాయిదా పడింది. అనంతరం జనవరి 17న మరోమారు డెత్ వారెంట్ జారీ అయ్యింది. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు శిక్ష అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ.. తమకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయంటూ ఉరి అమలుపై స్టే విధించాలని కోర్టును ఆశ్రయించారు నలుగురు దోషులు. ఈ నేపథ్యంలో స్టే విధిస్తూ పటియాలా కోర్టు తీర్పు వెలువరించింది.
దిల్లీ కోర్టు తీర్పుపై ఈనెల 1న దిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి కేంద్ర, దిల్లీ ప్రభుత్వాలు. సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును నేటికి వాయిదా వేసింది దిల్లీ హైకోర్టు.
వాడీవేడిగా వాదనలు...
గత ఆదివారం విచారణ సందర్భంగా కేంద్రం- దోషుల తరఫు న్యాయవాదుల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. ముందుగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా... దోషుల తీరుపై మండిపడ్డారు. న్యాయ వ్యవస్థను వినోదాత్మకంగా తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరి వాయిదా వేయడం కోసం చట్టాన్ని అవహేళన చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. అనంతరం ముగ్గురు దోషుల(అక్షయ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా) తరపున న్యాయవాది ఏపీ సింగ్ వాదించారు. ఉరిపై విధించిన స్టేను నిలిపివేయాలని కేంద్రం చేసిన అభ్యర్థనను తిరస్కరించాలని ధర్మాసనాన్ని కోరారు.
క్షమాభిక్ష పిటిషన్లు..
ఉరి అమలు కావాల్సిన నలుగురు దోషుల్లో ముకేశ్, వినయ్ క్షమాభిక్ష పిటిషన్లు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయి. అక్షయ్ ఈనెల 1న క్షమాభిక్షకు అర్జీ పెట్టుకోగా.. అది పెండింగ్లో ఉంది. మరో దోషి పవన్ ఇప్పటి వరకు క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోలేదు.
ఇదీ చూడండి: గోమాత పెళ్లి పెద్దగా వచ్చింది.. వివాహం ఘనంగా జరిగింది