శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించే విషయమై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం.. గతంలో ఇచ్చిన తీర్పుపై దాఖలైన 60 రివ్యూ పిటిషన్ల వాదనలు విననుంది.
ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలో ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్‌ఎన్ రావు, జస్టిస్ శాంతన గౌదర్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ ఆర్‌ఎస్ రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లు ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.
రివ్యూ పిటిషన్లు దాఖలు చేసిన వారికి జనవరి 6న నోటీసులు ఇచ్చింది ధర్మాసనం.
2018లో శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పుపై ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ సహా పలువురు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు.