కరోనా నుంచి కాపాడేందుకు కొత్త కొత్త మాస్కులు మార్కెట్లోకి వచ్చాయి. అయితే, బంగారం, వెండి, వజ్రపు మాస్కులైనా సరే, వైరస్ సోకే ప్రమాదాన్ని మాత్రమే తగ్గిస్తాయి. కానీ, గంటల తరబడి మాస్కులు, పీపీఈ కిట్లు ధరించే ఆరోగ్య సిబ్బందికి మాత్రం ముచ్చెమటలు పట్టిస్తాయి. ఊపిరాడకుండా చేస్తాయి. అందుకే, గంటల తరబడి వేసుకున్నా స్వచ్ఛమైన గాలి పీల్చేలా... ఓ అధునాతన మాస్కును రూపొందించింది కర్ణాటక హుబ్బలిలోని అబ్ స్లాన్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్.
ఈ సరికొత్త సాంకేతిక మాస్క్.. కరోనాతో ప్రత్యక్షంగా పోరాడుతున్న నర్సులు, వైద్యులకు ఎంతో ఉపయోగకరమంటున్నారు నిపుణులు. మాస్క్-'ప్యూరీ ఫ్లో వీ1.0' పేరిట సృష్టించిన ఈ మాస్కుకు ఓ హెపా ఫిల్టర్ జత చేశారు. ఈ ఫిల్టర్ గాలిలోని ఆక్సిజన్‌ను 99.99% శుభ్రపరుచి.. ఆ గాలిని ఓ పైపు ద్వారా మాస్కుకు చేర్చుతుంది. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ మాస్కు స్వచ్ఛమైన గాలి పీల్చుకునేందుకు దోహదపడుతుంది. ఒక్క సారి చార్జ్ చేస్తే దాదాపు 7 గంటలపాటు ఈ బ్యాటరీ పనిచేస్తుంది.
కర్ణాటక భారీ, మధ్యతరహా పరిశ్రమల మంత్రి జగదీశ్ శెట్టర్ చేతుల మీదుగా ఈ మాస్కును విడుదల చేశారు. భారత దేశంలోనే తొలిసారిగా ఇంతటి సాంకేతికతో మాస్కు రూపుదిద్దుకుందని ఆయన ప్రశంసించారు.
ఇదీ చదవండి: ప్లాస్టిక్‌లో జీవం పోసుకున్న 'నిలువెత్తు పచ్చదనం'