ఆగస్టు 5... దేశ చరిత్రలో అతి కీలకమైన రోజు. జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ.. ఆ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన రోజు.
ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంతో తలెత్తే పరిణామాల్ని ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన వ్యూహం అమలు చేసింది కేంద్రం. ఫలితంగా 5 నెలలుగా కశ్మీర్ ఆంక్షల వలయంలో ఉంది. పరిస్థితులకు అనుగుణంగా క్రమంగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది ప్రభుత్వం. తాజాగా అంతర్జాల సేవలను పాక్షికంగా పునరుద్ధరించింది. అయితే ఆ సేవలను కొన్ని సంస్థాగత అవసరాల కోసమే అందుబాటులోకి తెచ్చింది. సామాజిక మాధ్యమాలపై ఇప్పటికీ నిషేధం కొనసాగుతోంది.
కశ్మీర్లో భద్రతాపరంగా ఇలాంటి చర్యలు చేపట్టడం కొత్తకాదు. ఇవన్నీ దేశ అంతర్గత భద్రతకు సంబంధించినవి. అయితే.... ఇటీవల కాలంలో కేంద్రప్రభుత్వ వైఖరిలో మాత్రం కీలక మార్పు వచ్చింది. ఆర్టికల్ 370 రద్దుపై అంతర్జాతీయ సమాజం ప్రతిస్పందనలు పెద్దగా పట్టించుకోని మోదీ సర్కార్... ఈ మధ్య కాలంలో మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది.
దౌత్యవేత్తల పర్యటన
జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు విదేశీ దౌత్యవేత్తల పర్యటనను నిర్వహించింది భారత ప్రభుత్వం. కశ్మీర్ లోయలోని వివిధ వర్గాల వారిని కలిసేందుకు అనుమతిచ్చింది. అమెరికాతో పాటు మాల్దీవులు, వియత్నాం, బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, మొరాకో, నైజీరియా, అర్జెంటీనా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కశ్మీర్‌ను సందర్శించారు.
అయితే ఎంపిక చేసిన పాత్రికేయులు, రాజకీయ నేతలు, పౌర సంఘాల కార్యకర్తలను కలిసేందుకే దౌత్య వేత్తలకు అనుమతిచ్చింది ప్రభుత్వం. ఊహించినట్టుగానే కశ్మీర్‌లోని ప్రముఖ రాజకీయ నేతలు, నిర్బంధంలో ఉన్న నేతలను కలిసేందుకు వారికి అవకాశం లభించలేదు. విదేశీ ప్రతినిధులు కలిసిన వారందరూ కశ్మీర్ నిర్ణయాన్ని సమర్థించినవారే. వీరిలో చాలామంది 5 నెలల కాలంలో ఎలాంటి ఘర్షణ తలెత్తలేదని చెప్పినవాళ్లే కావటం గమనార్హం.
జమ్ము కశ్మీర్లో కేంద్రమంత్రుల పర్యటన ఉంటుందని ఇటీవల ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ప్రకటన చేశారు. స్థానిక ప్రజలను కలిసి అధికరణ 370 రద్దు ప్రయోజనాలతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వం చేయాలనుకున్న అభివృద్ధి గురించి వివరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
ప్రభుత్వ కనుసన్నల్లోనే ఎందుకు?
కశ్మీర్లో పరిస్థితులను చూస్తే ఈ చర్య చాలా అవసరం. ఇటీవల జరిగిన దౌత్యవేత్తల పర్యటనతో పాటు కేంద్ర మంత్రుల సందర్శన నిర్ణయాన్ని పరిశీలిస్తే కశ్మీర్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.
అయితే.. ఈ నిర్ణయాత్మక పర్యటనల వెనుక మర్మమేమిటో అర్థం కావటం లేదు. దౌత్యవేత్తలు ఎవర్ని కలవాలో ప్రభుత్వం నిర్ణయించటం ఎందుకు? అనే ప్రశ్న తలెత్తుతుంది. కశ్మీర్లో విదేశీ ప్రతినిధులు పర్యటిస్తుంటే.. భారత రాజకీయ నేతలు వారిని ఎందుకు కలవకూడదు? అన్నది మరో ప్రశ్న.
ఒకవేళ కశ్మీరీలకు దగ్గరవడమే ప్రభుత్వ లక్ష్యమని అనుకుందాం. అలాగైతే 2010లో భారత వ్యతిరేక అల్లర్ల సమయంలో అఖిలపక్ష ప్రతినిధుల పర్యటన తరహాలో మరో కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించకూడదు?
కశ్మీర్లో పరిస్థితులు అసాధారణంగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం తాత్కాలిక విధానాలతో సాధారణ స్థితిని సృష్టిస్తోంది. సహజమైన రాజకీయ పరిస్థితులు ఏర్పడితేనే లోయలో ప్రశాంతత ఆవరిస్తుంది.
సుప్రీం చొరవతో స్వల్ప ఊరట
కశ్మీర్లో అధికారాన్ని దుర్వినియోగం చేశారని.. ఇంటర్నెట్ సేవల రద్దు అక్రమమని గత వారం సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈ నేపథ్యంలో కొన్ని ఆంక్షల నుంచి కశ్మీరీలకు స్వల్ప ఊరట లభించింది. ఇంటర్నెట్ సేవలు పాక్షికంగా అందుబాటులోకి వచ్చాయి.
అయితే కశ్మీర్లో ఆంక్షలను ఎత్తివేయమనడానికి బదులుగా.. ప్రభుత్వ చర్యలను పునఃసమీక్షించాలని కోర్టు ఆదేశించింది. ఇదే తీర్పులో భాగంగా.. వాక్ స్వేచ్ఛ, జాతీయ భద్రతను సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కాపాడటం న్యాయవ్యవస్థ బాధ్యతని వ్యాఖ్యానించింది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను హరించటం ప్రజాస్వామ్య వ్యవస్థకు అంతానికి దారితీస్తుందని హెచ్చరించింది.
అయితే... కోర్టు ఆదేశాలను గౌరవించి పూర్తిస్థాయిలో సమీక్ష చేపట్టిన ప్రభుత్వం ఆంక్షలను యథావిధిగా ఉంచాలనే నిర్ణయించడం గమనార్హం.
లోయలో సరికొత్త రాజకీయాలు!
ఇప్పటివరకు చెప్పినదాని ప్రకారం.. ప్రస్తుత భారత ప్రభుత్వం అనుసరిస్తున్న కశ్మీర్ వ్యూహాన్ని తెలుసుకున్నాం. ఇందులో భాగంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో ఇప్పుడు చూద్దాం.
అన్నింటికన్నా ముందు.. కశ్మీర్లో ఆంక్షల సడలింపు చాలా ఆలస్యంగా జరుగుతోంది. ఇది క్రమంగా కొనసాగే ప్రక్రియ. కార్యరూపం దాల్చేందుకు సమయం పడుతుంది. సుప్రీం ఆదేశాలు, ఇంటా బయట నుంచి ఒత్తిడి ఉంటేనే ఈ ప్రక్రియలో వేగం పెరుగుతుంది.
రెండోది.. జమ్ముకశ్మీర్ సంప్రదాయ రాజకీయాల నుంచి ప్రముఖ పార్టీల నేతలను దూరం చేయటం. ప్రత్యామ్నాయంగా రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో సరికొత్త రాజకీయ వ్వవస్థ ఏర్పాటు చేయటం. ఫలితంగా కొత్తగా పుట్టుకొచ్చిన నేతలు కొత్త డిమాండ్లు, బేరసారాలతో కశ్మీర్ రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలుకుతుంది. ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న నాయకులు కశ్మీరీలపై ఎలాంటి ప్రభావం చూపలేరన్నది వాస్తవం. ఫలితంగా ప్రభుత్వం సృష్టిస్తోన్న సరికొత్త రాజకీయ వ్యవస్థకు పెద్దగా అడ్డంకులు వచ్చే ప్రమాదం కనిపించటం లేదు.
మూడోది.. కశ్మీరీ నాయకత్వాన్ని నియంత్రించటం. కేంద్రంతో వారి బేరసారాలను జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా తిరిగి ఇవ్వటం వరకే పరిమితం చేయటం. వచ్చే రోజుల్లో ఈ డిమాండే ప్రముఖంగా వినిపిస్తుంది. ఆ విధంగా మిగతా సమస్యలు పక్కదారి పడతాయి.
ఆచరణ సాధ్యమేనా?
ఈ వ్యూహాలన్నీ కాగితాలపై సులభంగానే కనిపిస్తున్నా.. ఆచరణలో సంక్లిష్టంగా ఉంటాయి. తీవ్ర అసంతృప్తితో ఉన్న కశ్మీరీ యువత ఈ వ్యూహాలకు ఆకర్షితులు అవుతారన్నది అనుమానమే. కొన్ని నెలలు, సంవత్సరాల్లోనే కశ్మీర్ రాజకీయ పగ్గాలను దిల్లీ చేతుల్లోకి తీసుకోవటం.. అందుకు కశ్మీరీ యువత సహకరించటం జరిగే పనేనా?
అన్నింటినీ మించి.. ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత ఏమవుతుందో ఎవరూ చెప్పలేరు. అప్పటివరకు వేసిన లెక్కలు, అనుసరించిన వ్యూహాలు ప్రజల తిరుగుబాటులో కొట్టుకుపోయే అవకాశమూ ఉంది.
పాక్ విషయంలో..
మరో ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. కశ్మీర్‌పై రాబోయే కాలంలో పాక్ వైఖరి ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకమే. అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ (ఎఫ్టీఏఎఫ్) ఒత్తిడి సడలిస్తే, మంచు తీవ్రత తగ్గితే కశ్మీర్లో తన వ్యూహాలతో పాక్ ముందంజ వేస్తుంది. అదే జరిగితే.. ఈ వేసవిలో మరింత వేడి పుట్టడం ఖాయం.
(రచయిత- హ్యాపీమాన్ జాకబ్, ఆచార్యుడు, జేఎన్‌యూ)
ఇదీ చూడండి: దక్షిణ భారతానికి తొలి 'సుఖోయ్ 30 ఎంకేఐ' దళం