వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సంస్కరణలు.. రైతులకు కొత్త అవకాశాలు అందించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నూతన చట్టాలతో అన్నదాతలకు న్యాయపరమైన రక్షణ కూడా లభించిందన్నారు. ఈ సంస్కరణ ఫలాలు రానున్న రోజుల్లో తెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
వారణాసి పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆరు వరుసల జాతీయ రహదారి-19ని జాతికి అంకితమిచ్చారు. అనంతరం బహిరంగ సభలో నూతన సాగు చట్టాల అంశాన్ని ప్రస్తావించారు. గతంలో రుణ మాఫీని ప్రభుత్వాలు ప్రకటించేవని.. కానీ అవి రైతుల వరకు చేరేవి కాదని ఆరోపించారు. పెద్దస్థాయి మార్కెట్లలో అవకాశాలు కల్పించి.. అన్నదాతలను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దడానికి కేంద్రం కృషి చేస్తోందని ప్రధాని వెల్లడించారు. ఇవన్నీ రైతుల సంక్షేమం కోసమే చేస్తున్నట్టు స్పష్టం చేశారు. మెరుగైన మద్దతు ధర, సౌకర్యాలు కల్పించే వారికి తమ ఉత్పత్తులను అమ్ముకునే స్వేచ్ఛ రైతులకు దక్కకూడదా? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మోదీ. ఒకప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించేవారని.. కానీ ఇప్పుడు ఊహాగానాలను, అసత్య వార్తలను వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. తమ నిర్ణయం సరైనదే అయినప్పటికీ.. ఊహాగానాలు వ్యాపింపజేసి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
ఎన్హెచ్-19 ప్రారంభం...
అంతకుముందు.. జాతీయ రహదారి-19లో భాగంగా ప్రయాగ్రాజ్- రాజాతలాబ్ వరకు నిర్మించిన ఆరు లేన్ల విస్తరణ ప్రాజెక్టును ప్రారంభించారు మోదీ. ఈ ప్రాజెక్టుతో వారణాసితో పాటు ప్రయాగ్రాజ్ వాసులు లబ్ధిపొందుతారన్నారు. నూతన రహదారులు, హైవేలు, ట్రాఫిక్ జామ్లను తగ్గించేందుకు రోడ్డు విస్తరణ పనులను చేపట్టినట్టు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం నుంచి ఎన్నడూ లేని విధంగా గత కొంతకాలంగా వారణాసిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:- డిసెంబర్ 4న అఖిలపక్ష సమావేశం- కరోనాపై చర్చ