ప్రసిద్ధమైన వేడినీటి గుండాలను శాస్త్రీయంగా హైడ్రో థర్మల్, జియో థర్మల్ స్ప్రింగ్స్ అని పిలుస్తారు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లో 20 వరకూ వేడినీటి బుగ్గలు ఉన్నాయి. భూమిలోపల్నుంచి సలసల మరిగే ఈ వేడి నీటిలో మెగ్నీషియం, పొటాషియం, సోడియం, భాస్వరం లాంటి ఔషధ గుణాలుంటాయి. 5 కి.మీ.లు కాలినడకన వెళ్తేనే ఈ గుండాల దగ్గరికి చేరుకోగలరు.
"ఈ వేడినీటి బుగ్గల ద్వారా, వ్యాధుల బారిన పడిన ప్రజలను ఆ భగవంతుడే కాపాడతాడు. ఈ నీరు ఎన్నో జబ్బులు నయం చేస్తుంది."
----అబ్దుల్ అజీజ్ వాగేయ్, భక్తుడు.
చలికాలంలో రాకపోకలకు ఇబ్బంది
ప్రసిద్ధ వేడినీటి గుండం ఒకటి లద్దాఖ్‌లో ఉండగా, కిష్‌త్వార్, రాజౌరీ జిల్లాల్లో ఒక్కొక్కటీ ఉన్నాయి. ప్రజలు ఎంతో నమ్మకంతో వాటిని సందర్శిస్తారు. ఈ నీటికి వ్యాధులను నయం చేసే అద్భుత శక్తి ఉందన్న నమ్మకంతో, అక్కడ స్నానం చేస్తారు. చర్మవ్యాధులు, కీళ్లనొప్పులు తగ్గించే శక్తి ఈ నీటికుందని నమ్మిక. మద్వ వద్వాన్ ప్రాంతంలోని పిర్‌పంజల్ శ్రేణిలో ఉన్న వేడినీటి గుండాలను ఈటీవీ భారత్ సందర్శించింది. చాలా వేడిగా ఉండే ఆ నీటిలో సేంద్రీయ హెర్బల్ ద్రావణం ఉంటుందని నమ్ముతారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ నుంచి, 150 కిలోమీటర్ల దూరంలో ఈ వేడినీటి గుండం ఉంది. చలికాలంలో రోడ్లపై దట్టంగా మంచు పేరుకుపోవడం వల్ల ఈ ప్రాంతానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి.
"ఈ వేడినీటి గుండాల వద్దకు పెద్దవయసున్న వారు కూడా వస్తారు. ఈ ప్రాంతానికి రోడ్లు సరిగా లేకపోవడం వల్ల వాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం దీన్ని గమనించి, రహదారి నిర్మిస్తే బాగుంటుంది."
---- సజ్జద్ అహ్మద్ భట్, భక్తుడు
ఈ వేడినీటి గుండాలను చేరుకునేందుకు చాలా కష్టమే పడాల్సి ఉంటుంది. 5 కిలో మీటర్ల మేర కాలినడకన వెళ్తేనే ఇక్కడికి చేరుకోగలరు.
"ప్రభుత్వం ఇక్కడ సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. అలా చేస్తే అయినా వచ్చే భక్తులు రాత్రివేళల్లో ఇక్కడే ఉండేందుకు అవకాశం కలుగుతుంది."
----సజ్జద్ అహ్మద్ భట్, భక్తుడు.
ఇన్నేళ్లైనా గుంతలరోడ్లే
చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రాంతానికి సందర్శకుల తాకిడి పెరిగింది. కానీ, ఇప్పటివరకూ సరైన రహదారులు నిర్మించేందుకు యంత్రాంగం ప్రయత్నాలు చేయలేదు. ఇన్నేళ్లైనా గుంతలరోడ్ల పరిస్థితి ఏమాత్రం మారలేదు. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెడితే, సులువుగా ఇక్కడికి చేరుకోవచ్చని పర్యటకులు కోరుతున్నారు.