దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు కొవిడ్ బారిన పడగా.. తాజాగా మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్ ఈ జాబితాలో చేరారు. ఆమెకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని నవనీత్ కౌర్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. 'నా కుమార్తె, కుమారుడితో పాటు ఇతర కుటుంబ సభ్యులకూ వైరస్ సోకింది. ఓ తల్లిగా వారిని జాగ్రత్తగా చూసుకోవడం నా తొలి కర్తవ్యం. వారిని జాగ్రత్తగా చూసుకొనే క్రమంలో నాకూ వైరస్ సోకింది' అని పేర్కొన్నారు.
అభిమానుల ఆశీస్సులతో తామంతా కరోనాను జయిస్తామని నవనీత్ కౌర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారు కూడా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమరావతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నవనీత్ కౌర్ గతంలో అనేక చిత్రాల్లో నటించారు. తెలుగులో శీను వాసంతి లక్ష్మి, శతృవు, జగపతి, రూమ్ మేట్స్, యమదొంగ, బంగారుకొండ తదితర చిత్రాల్లో నటించారు.
ఇదీ చూడండి: కర్ణాటకలో ఒక్కరోజే రికార్డు స్థాయి కేసులు