కరోనా సంక్షోభంతో రైతన్న ఇబ్బందులు పడుతుంటే.. అతడి ఆశలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది జూన్, జులైలో పెద్దగా వర్షపాతం లేకపోవడం వల్ల ఆగస్టుపైనే ఆశలు పెట్టుకున్నారు అన్నదాతలు. అయితే నాలుగు నెలల వర్షాకాలంలో ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాలు సాధారణంగానే కురవచ్చని తెలిపింది భారత వాతావరణ శాఖ. 2020 నైరుతి రుతుపవనాలు ఆశించిన మేర ప్రభావం చూపకపోవచ్చని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా ఈశాన్య భారతంలోనే ప్రస్తుతం భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆ ప్రాంతాలన్నీ జలమయమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నైరుతిపై ఆధారపడిన మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఈసారి తక్కువ వర్షపాతమే నమోదు కానుందని.. ఆగస్టులో 97 శాతం సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేశారు అధికారులు.
"సాధారణంగా దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాకాలం రెండో భాగంలో చూసుకుంటే వర్షపాతం తక్కువగా ఉండనుంది. 104 శాతం వర్షపాతం నమోదవ్వచ్చు. అందులో 8 శాతం హెచ్చుతగ్గులు ఉండొచ్చు."
- భారత వాతావరణ విభాగం
1961-2010 కాలంలో చూసుకుంటే దేశవ్యాప్తంగా కురిసిన వర్షాన్ని లాంగ్ పీరియడ్ యావరేజ్(ఎల్పీఏ)గా లెక్కగట్టారు. అందులో 88 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 96-104 శాతం ఉంటే ఎల్పీఏ సాధారణంగా గణిస్తారు. ప్రస్తుతం నైరుతి కాలంలో ఇదే స్థాయిలో వర్షాలు కురవనున్నాయి. దేశంలో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు వర్షాకాలంగా ప్రభుత్వం గుర్తిస్తోంది.