వివిధ అంతర్జాతీయ వేదికలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమైనప్పుడు పరస్పరం ప్రశంసించుకోవడం గతంలో అనేక సందర్భాల్లో చూశాం. ఇటీవల అమెరికాలో హౌడీ-మోదీ కార్యక్రమం, తాజాగా భారత్‌లో 'నమస్తే ట్రంప్' సభలోనూ ఇదే పునరావృతమైంది. ప్రపంచంలో రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య పెనవేసుకుంటున్న బలమైన అనుబంధానికి ఇది ఓ నిదర్శనం.
భారత్‌లో రెండు రోజుల ట్రంప్ పర్యటన ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక అనుబంధాన్ని మరింత బలోపేతం చేయనుంది. తొలిరోజు ట్రంప్ దంపతుల భారత పర్యటన అంబరాన్నంటింది. అదే సమయంలో నేడు ట్రంప్-మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. రక్షణ, అంతరిక్షం సహా పలు రంగాల్లో కీలక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, ఉగ్రవాదాన్ని నిరోధించడం, ఇంధన భద్రత, మతపరమైన స్వేచ్ఛ, అఫ్గానిస్థాన్‌లా తాలిబన్లతో శాంతి చర్చలు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తాజా పరిస్థితులపై చర్చలు జరగనున్నాయి.
'ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే విధంగా.. ప్రధాని మోదీ, నేను చర్చలు జరిపాం. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని నిర్మించే దిశగా.. ప్రపంచంలోనే ఉత్తమమైన రక్షణ పరికరాలను అందించేందుకు.. అమెరికా ఎదురుచూస్తోంది. ఇంతవరకు తయారు చేయని అత్యున్నత ఆయుధాలను మేము తయారు చేస్తాం. ఇప్పుడు భారత్‌తో చర్చలు జరుపుతున్నాం.''
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
కీలక ఒప్పందాలేంటి..?
డొనాల్డ్ ట్రంప్ ఒక దేశాధ్యక్షుడు మాత్రమే కాదు... స్వయంగా అతిపెద్ద వ్యాపార వేత్త. భారత్‌లో ఆయన భారీ పెట్టుబడులు పెట్టారు. అందుకే ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు, మేధో సంపత్తి హక్కులు వంటి కొన్ని అంశాలను మినహాయిస్తే ఇరు దేశాల మధ్య వాణిజ్యానుబంధం చెప్పుకోదగిన విధంగానే ఉంది.
ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తూ... ట్రంప్ పర్యటన సందర్భంగా భారత్-అమెరికా ఇంకెలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటాయన్నదే అసలు ప్రశ్న.
ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఏటా 12 వేలకోట్ల డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతోంది.
రక్షణ కొనుగోళ్లకు సై
అమెరికా నుంచి 2.6 బిలియన్‌డాలర్ల వ్యయంతో 24 MH-60 రోమియో హెలికాఫ్టర్లు కొనుగోలు చేసేందుకు ఓ ఒప్పందం 800 మిలియన్‌డాలర్ల వ్యయంతో 8 AH-64E అపాచీ హెలికాఫ్టర్లు కొనుగోలు చేసేందుకు మరో ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేసే అవకాశం ఉంది. మొత్తం 3 బిలియన్ డాలర్లకుపైగా విలువైన రక్షణ ఒప్పందంపై ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు.
ఆకాశ మార్గంలో శత్రువులు చేసే దాడులను తిప్పికొట్టడంలో దోహదపడగల 'సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ(ఐఏడీడబ్ల్యూఎస్)'ను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఇటీవలే సమ్మతించింది. 186 కోట్ల డాలర్ల విలువైన ఈ ఒప్పందానికి సంబంధించిన దస్త్రాలపై ట్రంప్ పర్యటనలో ఇరుదేశాలు సంతకాలు చేసే అవకాశాలున్నాయి.
అమెరికా రక్షణ రంగానికి చెందిన మరో కీలక సంస్థ 'బోయింగ్' భారత వైమానిక దళానికి తమ 'ఎఫ్‌ఈఎక్స్‌ఈగల్' యుద్ధ విమానాలను విక్రయించాలని భావిస్తోంది. వాటి ఎగుమతికి అనుమతులు మంజూరు చేయాలని అధికార వర్గాలను బోయింగ్ తాజాగా కోరింది. ఈ అంశం కూడా ట్రంప్ పర్యటనలో ఇరుదేశాల మధ్య చర్చకు వచ్చే అవకాశముంది.
వాణిజ్య ఒప్పందం లేనట్లే!
వాణిజ్యం, సుంకాల విషయంలో భారత్, అమెరికా మధ్య కొంతకాలంగా భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. అమెరికా ఉత్పత్తులపై భారత్ దిమ్మతిరిగిపోయేలా సుంకాలు వేస్తోందని, వాటిని తగ్గించాలని ఆ దేశం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య ఒప్పందం ఇప్పుడు ఉండకపోవచ్చని ట్రంప్ విస్పష్ట సంకేతాలు ఇచ్చారు. అయితే.. వాణిజ్యానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించుకొని... అవగాహన చేసుకుంటామని ట్రంప్ సోమవారం వెల్లడించారు.
ఇరుదేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలను.. మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించిన ట్రంప్ త్వరలోనే ఇవి సాకారమవుతాయని చెప్పారు. ఒప్పందాలు సహా సంబంధాల విషయంలో భారత్‌కు, అమెరికా ఎప్పుడూ విశ్వసనీయ భాగస్వామిగా ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు.
ప్యాకేజీ అయినా ఉంటుందా?
డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై దేశం భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ప్రస్తుతానికి ఒప్పందానికి బదులు వాణిజ్య ప్యాకేజీతోనే భారత్ సరిపెట్టుకోవాల్సి ఉంటుందని నిపుణులు అంచనా.