కేంద్రంలో, ఒడిశాలో భాజపా విజయం ఖాయమని ప్రధాని నరేంద్రమోదీ విశ్వాసం వ్యక్తంచేశారు. దేశభద్రత, వేగవంతమైన అభివృద్ధి కోసం దృఢమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం అవసరమని ఉద్ఘాటించారు. అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారో లేక అవినీతిపరుల్ని గెలిపిస్తారో ప్రజలే నిర్ణయం తీసుకోవాలని సూచించారు మోదీ.
ఒడిశాలోని సుందర్గఢ్లో భాజపా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. భాజపా 39వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
చాలా పార్టీలు ధనబలంతో తయారవుతాయని, భాజపా కేవలం కార్యకర్తల చెమటచుక్కలతో నిర్మితమైందని చెప్పారు మోదీ. వారసత్వ రాజకీయాలు, విదేశీ భావజాలం, ధనబలంతో భాజపా నిర్మాణమవలేదంటూ కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు చేశారు.
"భారతీయ జనతా పార్టీకి చెందిన 11 కోట్ల పైచిలుకు కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నమస్కరిస్తున్నాను. గత ఐదేళ్లలో మనం దేశానికి చూపించాం. కాంగ్రెస్ సంప్రదాయాలకు భిన్నమైన ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపించాం. భారత్ ప్రస్తుతం ఉగ్రవాదుల అడ్డాల్లోకి చొచ్చుకెళ్లి దాడులు చేస్తోంది. ప్రభుత్వాలు ఇంతకుముందూ ఉన్నాయి. కానీ మెరుపుదాడులపై కనీసం ఆలోచన కూడా చేయలేదు. బలమైన భారత్‌గా దేశం రూపాంతరం చెందుతోందనడానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వం ఎలా ఉండాలంటే... సబ్కా సాత్.. సబ్కా వికాస్ మంత్రంతో జాతి, మత, వర్గ భేదాలు లేకుండా ఉండాలి"
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి