కేంద్ర భద్రతా దళాల కుటుంబాల సంరక్షణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. దిల్లీలో సీఆర్పీఎఫ్ నూతన ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు షా. ప్రతీ పారామిలిటరీ సిబ్బంది తమ కుటుంబాలతో 100రోజుల సమయం గడిపేలా అవకాశం కల్పిస్తామని తెలిపిన కేంద్ర హోంమంత్రి.. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని స్పష్టం చేశారు. జవానుల కుటుంబాలకు ఆరోగ్య కార్డులు జారీ చేస్తామన్నారు.
సీఆర్పీఎఫ్ నూతన భవనం
దిల్లీలోని లోధీ రోడ్లో ఉన్న సీబీఐ ప్రధాన కార్యాలయం పక్కనే.. నూతన సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు. 2.23 ఎకరాల స్థలంలో రూ.277 కోట్లతో భవన నిర్మాణం చేయనున్నారు. 2022 నాటికి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టేలా కేంద్ర ప్రజా పనుల విభాగాన్ని(సీపీడబ్ల్యూడీ) ఆదేశించారు.
నూతన భవనంలో 11(జీ+) ఫ్లోర్లు, ఆడిటోరియం, కాన్ఫరెన్స్ హాల్, సబార్డినేట్ సిబ్బందికి శిబిరాలు, కేంద్ర పోలీస్ క్యాంటీన్, జిమ్నాసియం, గెస్ట్ రూం, కిచెన్, డైనింగ్ రూమ్, 520 కార్లు, 15 బస్సుల సామర్థ్యంతో పార్కింగ్ స్థలాన్ని నిర్మించనున్నారు. 6, 7వ అంతస్తులలో స్కైవాక్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. మురుగు నీటి శుద్ధి సహా వర్షపు నీరు సేకరణ వంటి అధునాతన వ్యవస్థలు ఉండేలా ప్రతిపాదించారు.
ప్రస్తుత సీఆర్పీఎఫ్ కార్యాలయం లోధీ రోడ్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్‌లో ఉంది. అయితే సీఆర్పీఎఫ్ కోబ్రా, ఆర్ఏఫ్ విభాగాలు, ఇతర సౌకర్యాలు రాజధానిలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. అన్ని వసతులు ఒకే చోట ఉండేలా నూతన కార్యాలయాన్ని రూపొందిస్తున్నారు.