పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం వచ్చే వారం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్‌పీఆర్) రూపకల్పనకు అనుమతి ఇవ్వనుంది. ఒకసారి ఎన్‌పీఆర్ తయారైన తరువాత దాని ఆధారంగా జాతీయ పౌర పట్టిక (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్-ఎన్‌ఆర్‌సీ)ని రూపొందించనుంది.
ఎన్‌పీఆర్ ఎందుకు?
దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) తయారీకి రూ.3,941 కోట్లు కేటాయించాలని కేంద్ర హోంశాఖ కోరుతోంది. దేశంలోని నిజమైన పౌరుల వివరాలు సేకరించడమే ఎన్‌పీఆర్ లక్ష్యం. ప్రజలందరి వేలి ముద్రలు సేకరించడం, అందరికీ పౌరసత్వ గుర్తింపు కార్డులు ఇవ్వడం ఈ ప్రక్రియ లక్ష్యమని ఓ అధికారి చెప్పారు. ఎన్‌పీఆర్‌ను తాజా సమాచారంతో సవరించినట్టు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) ధ్రువీకరించిన తరువాతే ఎన్‌ఆర్‌సీపై నోటిఫికేషన్ ఇస్తారు.
ఏప్రిల్ 1న శ్రీకారం
ఆర్‌జీఐ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అసోం మినహా మొత్తం దేశమంతటా జనాభా పట్టికను రూపొందిస్తారు. 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. జనాభా లెక్కలను మునుపటిలాగానే గ్రామ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సేకరిస్తారు. గడచిన ఆరు నెలలుగా ఒక ప్రాంతంలో నివసిస్తున్నవారిని, లేదంటే రానున్న ఆరు నెలల పాటు అదే చోట ఉంటామని చెప్పిన వారిని స్థానికులుగా పరిగణిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వాలు కాదనవచ్చా?
పౌరసత్వ చట్టం సవరణలపై ఆందోళనలు జరుగుతున్న దృష్ట్యా జనాభా పట్టిక రూపకల్పన కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్టు కేరళ, పశ్చిమ బెంగాల్ సీఎంలు ప్రకటించారు. అయితే ఇలాంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని కేంద్ర హోం శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి వస్తుందని చెబుతున్నారు.
స్పష్టంగా మత వివరాలు
ఈ మూడు దేశాల మైనార్టీలు భారత పౌరసత్వం కావాలనుకొంటే తమ మత వివరాలను స్పష్టంగా నమోదు చేయాలి. కొంతమంది చొరబాటుదార్లు మతం విషయంలో కావాలని తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉన్నందున, అలాంటివి జరగకుండా చూసేందుకు తగిన ప్రమాణ పత్రాలు తీసుకోనుంది. తప్పుడు పత్రాలు ఇస్తే నేరంగా పరిగణించనుంది.
పౌరసత్వం ఇచ్చే అధికారం కలెక్టర్లకు ఉండదు
తాజాగా ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం కింద బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌లకు చెందిన మైనార్టీలకు పౌరసత్వం కల్పించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇవ్వకూడదని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. ఇందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది. భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండడంతో కలెక్టర్లపై అదనపు భారం వేయకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోనుంది. ఈ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభంకావడానికి ముందే అంటే రానున్న జనవరి 22లోగా విధివిధానాలను ఖరారు చేయనుంది.