జనాభా లెక్కింపు సహా జాతీయ జనభా పట్టిక(ఎన్పీఆర్)పై చర్చించడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించనుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ నేతృత్వంలో శుక్రవారం ఈ సమావేశం జరగనుంది.
ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, జనగణన డైరక్టర్లు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నిర్వహించనున్న జనాభా లెక్కింపు విధివిధానాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు.
'మేం రాం'
అయితే ఈ సమావేశంలో తమ రాష్ట్ర అధికారులు పాల్గొనరని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదివరకే ప్రకటించారు. బంగాల్తో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా ఎన్పీఆర్ అమలును వ్యతిరేకిస్తున్నాయి. జాతీయ పౌర పట్టిక రూపొందించడానికి తొలి దశ ఎన్పీఆరేనని ఆరోపిస్తున్నాయి.
ప్రక్రియ ఏంటంటే?
దేశంలో ఉన్న ప్రజల సమగ్ర సమాచార డేటాబేస్ను రూపొందించడమే జనాభా పట్టిక ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. జనాభా వివరాలతో పాటు బయోమెట్రిక్ వివరాలు నమోదు చేయనున్నట్లు తెలిపారు.
ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు. గత ఆరు నెలలుగా ఒకే ప్రాంతంలో నివసించిన వ్యక్తులను, లేదా ఒక ప్రాంతంలో ఆరు నెలలు ఉండాలనుకుంటున్న వ్యక్తులను స్థానికులుగా గుర్తిస్తారు.
అసోం మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య ఎన్పీఆర్ ప్రక్రియ జరగనుంది. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే రూ.3,941.35 కోట్లు కేటాయించింది.
ఇదీ చదవండి: చర్చలతోనే వివాదాలకు తెర: ప్రధాని మోదీ