క్షణానికో మలుపుతో నరాలు తెగే క్రికెట్ మ్యాచ్‌ను తలపిస్తోంది కర్ణాటక రాజకీయం. ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచి ఆటుపోట్లు ఎదుర్కొంటున్న కుమారస్వామి సర్కారు కథ కైమాక్స్‌కు చేరింది. ప్రభుత్వంపై అసంతృప్తితో రాజీనామాలు చేసిన 14 మంది అధికార పక్షం ఎమ్మెల్యేలు ముంబయి నుంచి తాజాగా గోవాకు పయనమయ్యారు.
14 మంది శాసనసభ్యుల్లో 10 మంది కాంగ్రెస్, ఇద్దరు జేడీఎస్, మరో ఇద్దరు స్వతంత్రులు. వీరందరినీ ముంబయి భాజపా యువ మోర్చా అధ్యక్షుడు మోహిత్ భారతీయ జాగ్రత్తగా కాపలా కాస్తున్నారని సమాచారం.
రిసార్ట్ రాజకీయం...
కర్ణాటక రాజకీయం మరోసారి రిసార్ట్‌కు చేరింది. భాజపాకు దొరకకుండా శాసనసభ్యులను గతంలో రిసార్ట్‌లో ఉంచిన కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి మరోసారి ఆ సమస్యే ఎదురైంది. ముంబయి సబర్బన్ బాంద్రా హోటల్లో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు సోమవారం సాయంత్రం 5 గంటలకు హోటల్ ఖాళీ చేసినట్లు మహరాష్ట్ర భాజపా నేత ప్రసాద్ లాల్ తెలిపారు. వీరందరూ గోవాలోని రిసార్ట్‌కు వెళ్లినట్లు సమాచారం.
అంచుల్లో...
కర్ణాటక సర్కారు పతనం అంచుల్లో ఉంది. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే కుమారస్వామి సర్కారు దాదాపు కూలినట్టే.