పర్యావరణ కాలుష్యంతో హిమాలయాలకు ముప్పు పెరుగుతోంది. 40 ఏళ్ల క్రితంతో పోల్చితే ప్రస్తుతం రెండు రెట్లు అధికంగా మంచు కరుగుతోందని అమెరికా గూఢచారి ఉపగ్రహాలు తీసిన ఫొటోల ద్వారా వెల్లడైంది. ఏటా సుమారు 800 కోట్ల టన్నుల మంచు కరిగిపోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
1971, 1986లలో అమెరికా పంపించిన కేహెచ్-9, హెక్సాగాన్ అనే గూఢచారి ఉపగ్రహాలు కొన్ని ఛాయాచిత్రాలను పంపించాయి. వీటిని పరిశీలించిన కొలంబియా భూ పరిశోధన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు హిమాలయాల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు.
"ఒకవేళ ఈ శతాబ్దం ముగిసేవరకు భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీ సెల్సియస్లోపు ఉంచగలిగినా... మూడో వంతు హిమాలయాలు తుడిచిపెట్టుకుపోతాయి. కానీ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల వరకు పెరిగితే.. దాదాపు సగం హిమాలయాలు కరిగిపోతాయి. వివిధ నివేదికలు, పరిశోధనలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. సుమారు సగం మంచు పర్వతాలు తుడిచిపెట్టుకుపోతాయి. "
- డా.భోపాల్ పండేయా, హిమాలయ వాతావరణ పరిశోధకుడు
72 శాతమే ఉంది...
2000 సంవత్సరం నుంచి ఆసియాలోని పర్వతాల్లో ఏటా 830 కోట్ల టన్నుల మంచు కరిగిపోతోంది. 1975-2000 మధ్య కాలంలో అది 430 కోట్ల టన్నులుగా ఉండేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 1975తో పోలిస్తే ప్రస్తుతం హిమాలయాల్లో 72 శాతం మాత్రమే మంచు ఉందని తెలిపారు. 2000 సంవత్సరం నుంచి ఏటా 1 శాతం మంచు కరిగిపోతోందని వెల్లడించారు.
తీవ్ర నీటి ఎద్దడికి మూలం...
ఇదే రీతిలో మంచు కరిగితే.. హిమాలయాల ద్వారా వచ్చే నదులు అడుగంటిపోయి తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని సూచించారు.
చాలా ఏళ్లుగా హిమాలయాలు కరిగిపోయేందుకు గల కారణాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. అందులో కాలుష్యం, వర్షపాతంలో మార్పు వంటివి ఉన్నాయి. కానీ పర్యావరణ మార్పులే హిమాలయాలపై అధిక ప్రభావం చూపుతున్నాయని కొలంబియా శాస్త్రవేత్తల బృందం నిర్ధరించింది.
ఇదీ చూడండి: అగ్రశ్రేణి విద్యాలయాల జాబితాలో భారత్కు చోటు