పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన ఎడారి మిడతలు మధ్యప్రదేశ్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే వందల హెక్టార్లలో పంటను నాశనం చేశాయి. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్‌కు విస్తరించిన ఈ మిడతల దండు దాదాపు 28 జిల్లాలను కమ్మేశాయి.
మధ్యప్రదేశ్‌లోని షియోపుర్, నీముచ్, ఉజ్జయిని, రత్లాం, దేవాస్, అగర్ మాల్వా, రైసెన్, నర్సింగ్పుర్, సెహోరే, హోషంగబాద్, దేవాస్ ఛతర్‌పుర్, సత్నా ప్రాంతాలు మిడతల దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటితో పాటు భోపాల్, ఇండోర్, సాగర్, గ్వాలియర్ ప్రాంతాల్లో సైతం మిడతలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒక్క బాలాఘాట్ జిల్లాలో 40 వేల హెక్టార్ల పంట నాశనమైనట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
పెసర పంటపై పంజా
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 వేల హెక్టార్ల పెసర పంట, ఉజ్జయిని జిల్లాలో 60శాతం నువ్వుల పంట, మొరెనా, భిండ్, దైతా జిల్లాల్లో 25 శాతానికిపైగా కూరగాయల పంటలను రైతులు నష్టపోయినట్లు అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా 40-50 శాతం పూల తోటలు ధ్వంసమైనట్లు లెక్కగట్టారు. ఈ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
పంటలను కాపాడుకునేందుకు పాట్లు
లాక్డౌన్ కారణంగా ఇప్పటికే దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ మిడతల బెడద కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు, పంటపొలాలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. రాత్రంతా మెలకువగా ఉండి పంటలకు కాపలా కాస్తున్నారు. వంట సామగ్రితో శబ్దాలు చేస్తున్నారు. మిడతలను చెదరగొట్టేందుకు టపాసులు కాలుస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు
మిడతల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యున్నత సమావేశాలు నిర్వహించి చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్లు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కమల్ పటేల్ వెల్లడించారు.
"మిడతల నివారణలో కేంద్రానికి చెందిన నాలుగు బృందాలు సైతం సహాయం చేస్తున్నాయి. వ్యవసాయ, అటవీ, పోలీస్ సిబ్బందితో కూడిన బృందాలను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేశాం. అగ్నిమాపక యంత్రాలతో పెద్ద ఎత్తున పురుగుల మందులు పిచికారీ చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం."
-కమల్ పటేల్, మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి
ఇదిలా ఉంటే మిడతల నిర్మూలనకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది. 303 ప్రాంతాల్లోని 47 వేల హెక్టార్ల భూభాగంలో మిడతల నివారణకు పురుగుల మందులు వెదజల్లినట్లు తెలిపింది. మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో కలిపి దాదాపు 200 మిడతల నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది.
మిడతల బెడత ఇప్పట్లో పోదా..?
మిడతలను ఇప్పట్లో అరికట్టే అవకాశం లేదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లో 7నుంచి 8 వేల కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. రబీ పంట కోతలు పూర్తయినప్పటికీ.. పెసర, పండ్లు, కూరగాయల పంటలు రాష్ట్ర వ్యాప్తంగా పండిస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా చాలా వరకు పంట.. పొలాల్లోనే ఉండిపోయినట్లు చెప్పారు. అందువల్ల నష్టం అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆగిన చోట విధ్వంసమే..
ఈ మిడతల జీవిత కాలం 3-5 నెలలు ఉంటుందని మధ్యప్రదేశ్ వ్యవసాయ నిపుణుడు జీఎస్ కౌశల్ వెల్లడించారు. అవి ఎక్కడైతే ఆగుతాయో అక్కడ విధ్వంసం సృష్టిస్తాయని హెచ్చరించారు.
"గాలి దిశను బట్టి ఈ కీటకాలు ప్రయాణిస్తాయి. ఇవి ఆగిన చోట పచ్చదనం కనిపించకుండా చేస్తాయి. చెట్లు, మొక్కలు, పంటలు అన్నింటినీ సర్వనాశనం చేస్తాయి. జూన్ నుంచి వర్షాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో మిడతల సంతానోత్పత్తి భారీగా పెరుగుతుంది."
-జీఎస్ కౌశల్, వ్యవసాయ నిపుణుడు
దేశంలో...
దేశవ్యాప్తంగా చాలా సార్లు మిడతల దండు దాడి చేసింది. 1926-31 మధ్య మిడతల కారణంగా రూ.10 కోట్ల విలువ చేసే పంటలు నాశనమయ్యాయి. 1940-46 మధ్య రెండు సార్లు మిడతలు దాడి చేశాయి. ఈ నేపథ్యంలోనే మిడతల హెచ్చరిక సంస్థ(ఎల్‌డబ్ల్యూఓ)ను 1946లో స్థాపించారు. 1993లో మరోసారి జరిగిన వీటి దాడుల్లో రైతులకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.
ఇదీ చదవండి: గుజరాత్లో కరోనా విజృంభణకు అలసత్వమే కారణమా?