మహారాష్ట్రలోని రత్నగిరిలో ఆనకట్ట కూలిపోయిన ఘటనకు పీతలే కారణమన్నారు ఆ రాష్ట్ర నీటి సంరక్షణ శాఖ మంత్రి తానాజీ సావంత్ . తివారె డ్యామ్‌లో పెద్ద సంఖ్యలో పీతలు చేరినందునే ఆనకట్టకు గండి పడిందని చెప్పారు. స్థానికులు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని.. నీటి పారుదల విభాగం చర్యలు తీసుకునే లోపే ఘటన జరిగిందని సావంత్ తెలిపారు.
మంగళవారం జరిగిన ఈ ఘటనలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 19మంది మరణించినట్లు అధికారులు నిర్ధరించారు.
![Tiware Dam- Maharasthtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3751201_collage.jpg)
డ్యామ్ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రత్నగిరిని సందర్శించి బాధితులకు భరోసా ఇవ్వాలని.. మహారాష్ట్ర నీటిపారుదల మంత్రి గిరీష్ మహాజన్‌ను ఆదేశించారు ఫడణవీస్.