మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని భాజపా ప్రకటించిన నేపథ్యంలో.. సర్కారు ఏర్పాటు చేయాలని శివసేనను ఆహ్వానించారు గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ. ప్రభుత్వ ఏర్పాటుపై ఆసక్తి ఉందో లేదో తెలపాలని సూచించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 56 సీట్లు గెలుపొంది భాజపా (105 సీట్లు) తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది సేన. అందువల్లే గవర్నర్ ఆ పార్టీకి ఆహ్వానం పంపారు. ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖతను, బలాన్ని తెలియజేయాలని ఆ పార్టీ సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండేకు సమాచారమిచ్చారు. సోమవారం రాత్రి 7.30 గంటల్లోగా నిర్ణయం తెలపాలని గవర్నర్ సూచించారు.
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ముందుగా భాజపాను గవర్నర్ ఆహ్వానించారు. సరిపడా సంఖ్యా బలం లేని కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని భాజపా తెలిపింది.
'శివసేన అభ్యర్థే సీఎం'
ఎట్టిపరిస్థితుల్లోనూ శివసేన అభ్యర్థే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ పునరుద్ఘాటించారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఎర్పాటు చేయడం లేదని తెలిపిన భాజపా తీరును విమర్శించారు. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే విషయంపై పార్టీ ఎమ్మెల్యేలందరికీ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఈరోజు ఉదయం స్పష్టతనిచ్చారని తెలిపారు రౌత్. రానున్న రోజుల్లో శివసేన అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారని ఠాక్రే చెప్పినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రపతి పాలనకు కాంగ్రెస్ నో
సర్కారు ఏర్పాటు చేయలేమని భాజపా ప్రకటించిన నేపథ్యంలో..మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను కోరుకోవడం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏం చేయాలో అధిష్ఠానం ఆదేశాలను అనుసరించి నడుచుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ తెలిపారు.
తెగదెంపులు చేసుకుంటేనే...
ఎన్సీపీ మాత్రం... భాజపా కూటమి నుంచి శివసేన బయటికి రావాలని తెలిపింది. భాజపాతో తెగదెంపులు చేసుకుంటేనే శివసేనకు తాము మద్దతిస్తామని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు.