ఈ యువతీ యువకులు, పిల్లలు కసరత్తులు చేస్తూ చెమటోడుస్తోంది ఏ ప్రొఫెషనల్ జిమ్‌లోనో అనుకుంటే పొరబాటే. వీళ్లంతా కలిసి, స్వయంగా సొంతూర్లోని ఓ తోటలో కట్టుకున్న దేశీయ వ్యాయామశాల ఇది. మధ్యప్రదేశ్‌లోని గోవ్రావ్ఖుర్ద్ గ్రామం యువకులు ఊర్లో దొరికే ముడి సరకుతోనే పచ్చనిచెట్ల మధ్య తాత్కాలిక వ్యాయామశాల ఏర్పాటు చేసుకున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పిల్లలు, మహిళలు, యువతీ యువకులు సైతం కసరత్తులు చేసుకునేందుకు ఇక్కడికి వస్తారు.
"వివిధ నగరాల్లో చదువుకుంటున్న విద్యార్థులంతా లాక్డౌన్ కారణంగా తిరిగి ఊరికి చేరుకున్నాం. స్థానికంగా ఉన్న జిమ్ కూడా మూతపడటం వల్ల వ్యాయామం చేసుకునేందుకు చాలా ఇబ్బందిగా మారింది. అప్పుడే.. ఒక్కో పరికరం తయారు చేసుకుంటూ దేశీ జిమ్ ఏర్పాటు చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. జిమ్‌లో నిత్యం కసరత్తులు చేయడం వల్ల క్రమంగా మా ఆరోగ్యం మెరుగు పడుతోంది."
- వికాస్ సింగ్, విద్యార్థి
ఎక్కడుందంటే..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొన్ని నెలలపాటు జిమ్‌లు, హెల్త్క్లబ్బులు మూతబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో వ్యాయామం చేసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్న సత్నా యువత.. శారీరక దృఢత్వం కాపాడుకునేందుకు ఈ పరిష్కారం కనుగొన్నారు. సత్నా జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉందీ వ్యాయామశాల.
"మహిళల కోసం కూడా ప్రత్యేక సమయం కేటాయించారు. ఆత్మనిర్భర్ భారత నిర్మాణంలో భాగంగా ఆత్మనిర్భర్ జిమ్ కట్టుకుని, ఊరి యువత ఎంతో సంతోషంగా ఉన్నారు."
- వికాస్ సింగ్, విద్యార్థి
"కరోనా సమయంలో నగరానికి వెళ్లే వీలుండేది కాదు. వ్యాయమం చేసేందుకు కుదిరేది కాదు. అప్పుడే అన్నయ్యలంతా కలిసి జిమ్ నిర్మించారు. ఇక్కడికి వచ్చి, వ్యాయామం చేస్తున్నాం. పోలీసు అయ్యేందుకు కష్టపడుతున్నాం."
- హేమలత సింగ్
ఈ జిమ్‌లో ఉన్న అన్ని పరికరాలు స్థానికంగా దొరికే వెదురు బొంగులు, ఇటుకలు, రాళ్లు, తాళ్లు, టైర్లు వినియోగించి తయారుచేశారు. మధ్యప్రదేశ్ పోలీసులు, ఆర్మీలో చేరేందుకు సన్నద్ధం అవుతున్న యువతీ యువకులు ఈ జిమ్‌లో నిత్యం సాధన చేస్తున్నారు.
తొలుత విచిత్రంగా చూసినా..
పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న మరో విద్యార్థి కరణ్వీర్ సింగ్.. ఫిజికల్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించేందుకు ఇక్కడే నిత్యం కసరత్తులు చేస్తున్నాడు. లాక్డౌన్లో జిమ్‌లు మూతపడటం వల్ల కరణ్వీర్ సింగ్.. కొంతమంది స్నేహితులతో కలిసి, జిమ్ ఏర్పాటుకు స్థానికుల మద్దతు కూడగట్టాడు. దేశీయ జిమ్ ఏర్పాటు చేసిన మొదట్లో విచిత్రంగానే అనిపించినా.. క్రమంగా జిమ్‌ను వినియోగించుకుని లబ్ధి పొందినవారి సంఖ్య పెరుగుతుండడం చూసి, దాని విలువ తెలిసిందన్న వారూ ఉన్నారు. జిమ్‌లో చేరిన తర్వాత శారీరకంగా దృఢంగా మారామని చెప్తున్నారు.
"నేను ప్రభుత్వోద్యోగానికి సన్నద్ధమవుతున్నాను. శారీరకంగా దృఢంగా ఉండడం అవసరం. లాక్డౌన్ సమయంలో జిమ్ మూతపడటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. శారీరక దృఢత్వం కోల్పోసాగాం. మెల్లగా స్నేహితులు, స్థానికుల సహకారంతో జిమ్ ఏర్పాటు చేసుకున్నాం."
- కరణ్వీర్ సింగ్, విద్యార్థి
స్థానికులకు ఉచితం..
ఈ దేశీ జిమ్‌ను నిర్వహిస్తున్న నృపేంద్ర సింగ్...జిమ్ స్థాపనకు వ్యాయామంపై తమకున్న ఆసక్తే ప్రధాన కారణమని చెప్తున్నాడు. ఓ ఖాళీ స్థలంలో నలుగురు అబ్బాయిలతో ప్రారంభమైన వ్యాయామశాల.. క్రమంగా స్థానికుల సహకారం అందుకుని, ప్రస్తుతం పెద్దఎత్తున నడుస్తోంది. కలప, మట్టి, ఇసుక లాంటి అందుబాటులో ఉన్న ముడిసరుకుతోనే నిర్మితమైన జిమ్‌లో.. స్థానికులందరికీ సభ్యత్వం ఉచితమే.
"లాక్డౌన్ సమయంలో జిమ్ ప్రారంభించాల్సిన అవసరం రోజురోజుకీ పెరుగుతూ వచ్చింది. చదువుల కోసం ఊరు వదిలి వెళ్లిన వారంతా తిరిగి వచ్చారు. వారికి వ్యాయమం చేయడం కష్టంగా మారింది. మా అవసరాల కోసమే ఉచిత వ్యాయామశాల ఏర్పాటుచేసుకున్నాం. ఓ ఖాళీ ఉద్యానవనంలో నలుగురు అబ్బాయిలతో ప్రారంభమైంది. తర్వాత స్థానికులకు కూడా ఆసక్తి పెరిగి, క్రమంగా సహకారం అందించసాగారు. కరోనాకాలంలో ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. జిమ్ ఫీజు కట్టేందుకు కష్టంగా మారింది. అందుకే వెదురు బొంగులు, ఇటుకలు, రాళ్లు, ఇనుము, టైర్ల లాంటివి ఉపయోగించి, 15 రోజుల్లో జిమ్ నిర్మించుకున్నాం."
- నృపేంద్ర సింగ్, జిమ్ డైరెక్టర్
15 రోజుల్లోపే నిర్మాణం పూర్తైన ఈ వ్యాయామశాలకు రోజూ 50 మందికి పైగా వ్యాయామం చేసుకునేందుకు వస్తారు. ఊర్లోనే ఓ జిమ్ ఉండడం వల్ల.. ఇంకోచోటికి పోవాల్సిన అవసరం లేదని గ్రామస్థులు చెప్తున్నారు.
ఇదీ చదవండి: ఎంత ఎత్తున్నా సులువుగా ఎక్కేస్తాడు 'కోతిరాజ్'