పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా రాజ్యాంగ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేంద్రమంత్రులు , పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు.
1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్రం పొందలేదన్నారు మోదీ. అంతకుముందు కూడా మన దేశం స్వతంత్రంగానే ఉందని వ్యాఖ్యానించారు. భారత ప్రజలు రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా భావిస్తున్నారన్నారు మోదీ. రాజ్యాంగ పరిషత్ ఛైర్మన్ బాబూ రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్ సహా నాటి కమిటీ సభ్యులపై ప్రశంసలు కురింపించారు. రాజ్యాంగంపై మచ్చపడకుండా దేశప్రజలంతా ఉమ్మడిగా నిలిచారని ఉద్ఘాటించారు మోదీ. పటిష్టమైన మన రాజ్యాంగం కారణంగానే మనమంతా ఒక్కటిగా నిలిచామని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ దినోత్సవం నాడే ముంబయి దాడులు జరగడం దురదృష్టకరమన్న మోదీ ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలిపారు.
'రాజ్యాంగంలో భారతీయ హృదయ ధ్వని'
భారతీయ విలువలను నేడు ప్రపంచమంతా గౌరవిస్తోందన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. మన రాజ్యాంగంలో భారతీయుల హృదయ ధ్వని వినిపిస్తుందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను గౌరవించడం పౌరులందరి బాధ్యత అని స్పష్టం చేశారు. కర్తవ్యాన్ని సక్రమంగా పాటిస్తే హక్కుల కోసం వెదుకులాట ఉండదని ఉద్ఘాటించారు.
'మహా మేధస్సులతో రాజ్యాంగ నిర్మాణం..'
భారత్‌కు చెందిన అత్యుత్తమ మేధస్సులు రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకున్నాయన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. భారత సార్వభౌమాధికారమే మన తొలి ప్రాధాన్యం కావాలని ఉద్ఘాటించారు. ఆధునిక భారత నిర్మాణం అనే లక్ష్యంతో రాజ్యాంగ కమిటీ ఛైర్మన్ రాజేంద్రప్రసాద్ పనిచేశారన్నారు వెంకయ్య. రాజకీయ ప్రజాస్వామ్యంతో సహా సామాజిక ప్రజాస్వామ్యాన్ని అంబేడ్కర్ కాంక్షించారని ఉద్ఘాటించారు. మాతృభాష మన కంటిచూపువంటిదని అమ్మ భాషను కాపాడుకోవాలన్నారు.
ఆవిష్కరణలు
రాజ్యాంగ దినోత్సవం వేదికగా పలు ఆవిష్కరణలు జరిగాయి. జాతీయ యువ పార్లమెంట్ పథకం పోర్టల్‌ను ప్రారంభించి 2020 లోక్ సభ క్యాలెండర్ ఆవిష్కరించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. రాజ్యసభ 250 వ సెషన్ సందర్భంగా రూ. 250 నాణెం విడుదల చేశారు. రాజ్యసభపై 'భారత పార్లమెంట్లో రాజ్యసభ పాత్ర' అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.