శివాంగి.. ఆ పేరులో ఏదో తెలియని శక్తి ఉంది. పేరుకు తగ్గట్లుగానే ఆమె అసాధారణ రీతిలో నౌకాదళంలో తొలి మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించారు. కేరళ కొచ్చిలోని దక్షిణ నావల్ కమాండ్‌లో రెండు దశల శిక్షణ పూర్తి చేసుకొని నేడు కొచ్చిలోని నౌకాదళ విభాగంలో పదవీ బాధ్యతలు చేపట్టారు.
బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో పుట్టిన శివాంగి... ఇకపై డోర్నియర్ నిఘా విమానాలతో ఆకాశవీధుల్లో చక్కర్లు కొట్టనున్నారు.
"నాకు, నా తల్లిదండ్రులకు ఎంతో గర్వంగా ఉంది. దీని కోసం నేను చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. చివరకు చేరుకోగలిగాను. ఇది ఒక గొప్ప అనుభూతి. నా మూడో దశ శిక్షణ పూర్తి చేయాలనే లక్ష్యంగా ఉన్నాను."
- శివాంగి.
నౌకాదళంలో మహిళలు ఇప్పటివరకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులుగా, పరిశీలకులుగా మాత్రమే పనిచేశారు. ఇప్పుడు శివాంగి పైలట్‌గా ప్రస్థానం ప్రారంభించారు.
భారత నౌకాదళంలో 735 పైలట్ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 644 మంది పని చేస్తున్నారు. 200లకు పైగా విమానాలు సేవలందిస్తున్నాయి. ఇందులో మిగ్-21కే ఫైటర్స్, బోయింగ్ పీ-81 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు ఉన్నాయి.
ఇదీ చూడండి: ఎస్సీ, ఎస్టీ కోటాలో క్రీమీ లేయర్‌పై కేంద్రం రివ్యూ పిటిషన్