ఓ ఉపాధ్యాయుడు తన ఇంటిని అందమైన మ్యూజియంగా మార్చారు. అదేదో అందరిలా పురాతన వస్తువులు సేకరించి కాదు.. వాడి పారేసిన వస్తువులను రీసైక్లింగ్ చేసి. ఇలా అనేక వ్యర్థాలను పునరుత్పాదించి ఏకంగా తన ఇంటినే ఓ ప్రయోగశాలగా రూపొందించారు. ఈ అద్భుతమైన ప్రదర్శనశాల కేరళలో ఉండగా.. దానికి ఆద్యుడు కొల్లం జిల్లాలోని కొట్టాయంకు చెందిన సైన్స్ టీచర్ నజీమ్ కె.సుల్తాన్.
ప్రత్యేక ఆకర్షణగా..
భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడైన నజీమ్.. ఎంతో అపురూపంగా ఈ ప్రయోగశాలను అలంకరించారు. బయటినుంచి చూడగానే.. అద్భుతమైన అనుభూతిని కలిగించేలా ఉంటుంది ఆయన గృహం. చిన్న ప్రదేశంలోనే పెద్ద తోటను ఏర్పాటు చేశారు. అక్కడ పాత హెల్మెట్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, క్యాన్లు పూలకుండీలుగా ఉంటాయి. వాడుకలో లేని సైకిల్‌పై గుబురు చెట్లు మరింత అందాన్ని చేకూరుస్తాయి. ఇలా వేటికవే ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే.. కొవిడ్‌ను ప్రతిబింబించేలా ప్లాస్టిక్ సీసాలతో తయారైన కరోనా వైరస్ నమూనా ఆ అందాలకు మరింత సొబగునందిస్తోంది.
సుల్తాన్ రూపొందించిన ఆకర్షణీయమైన వెదురు స్విచ్ బోర్డులు చూపరులను కట్టిపడేస్తాయి. కిటికీకి అమర్చిన కృత్రిమ వర్షమాపని.. దానికి కింది భాగంలోనే అమర్చిన అక్వేరియం ఈ ప్రదేశానికి మరింత సౌందర్యాన్ని చేకూరుస్తున్నాయి.
'వెల్లుల్లి' పుష్పం..
ఏ వస్తువునూ వ్యర్థం చేయరాదనే పట్టుదలతో.. వెల్లుల్లి తొక్కలతో అందమైన పువ్వులను తయారు చేశారీ ఉపాధ్యాయుడు. పాత పీవీసీ పైపులు, పనికిరాని ఎలక్ట్రిక్ పరికరాల సాయంతో సంగీత వాయిద్యాలనూ రూపొందించారు. అంతేకాకుండా.. పాములను పట్టుకోవడానికి ఇటీవలే ఓ ప్రత్యేక పరికరాన్ని తయారు చేశారీ టీచర్. అయితే.. దానికి పేటెంట్ హక్కులు రావాల్సి ఉంది.
పాఠశాల స్థాయి నుంచే..
విద్యార్థి స్థాయి నుంచే సైన్స్ ఫెయిర్లలో పాల్గొనడం వల్ల.. వ్యర్థ పదార్థాలను రీసైకిల్ చేయడంపై అవగాహన కల్పించుకున్నారు నజీమ్. అలా సైన్స్‌పై మక్కువతో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా రాణిస్తున్నారు. తన నైపుణ్యంతో అనేక బోధనోపకరణాలను తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు సుల్తాన్. స్మార్ట్ తరగతి గదుల రూపకల్పన వంటి సైన్స్ ప్రాధాన్య కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు సహకారమందిస్తున్నారు.
వ్యర్థ పదార్థాలను ఆసక్తికరమైన, అందమైన కళాఖండాలుగా మార్చవచ్చని నిరూపించారీ ఉపాధ్యాయుడు. ఇలా వస్తువులను రీసైక్లింగ్ చేయడం ద్వారా డబ్బును ఆదా చేస్తూనే.. ఇంటిని అలంకరించుకోవచ్చని నజీమ్ సుల్తాన్ రుజువు చేశారు.
ఇదీ చదవండి: ఔరా అనామిక: ఎనిమిదో తరగతిలోనే టీచర్ అయిన బాలిక!