కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరుకుంది. అధికార కూటమికి చెందిన 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో నెలకొన్న సంక్షోభం.. శాసనసభలో విశ్వాస పరీక్ష వరకూ వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న బల నిరూపణ చేసుకోనున్నారు ముఖ్యమంత్రి కుమారస్వామి. అయితే ఈ విశ్వాస పరీక్షకు ముంబయిలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలందరూ గైర్హాజరు అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
రాజీనామాపై వెనక్కి తగ్గని నేతలందరూ.. వచ్చే గురువారం నాడు ముంబయి హోటల్ గదికే పరిమితమవనున్నారని సమాచారం. ఒకవేళ అదే జరిగితే కన్నడ అసెంబ్లీలో.. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి బలం 116 నుంచి 100కు పడిపోనుంది. ప్రతిపక్ష భాజపా అధికారం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి కుర్చీ కుమారస్వామికి దూరమయ్యే అవకాశాలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్ నేతలు ఏం చేయనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
మరోసారి బుజ్జగింపులు
కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముకున్న తరుణంలో.. చివరిసారిగా రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలు చేయనున్నారు కూటమి సీనియర్ నేతలు. మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు మరికొందరు సీనియర్ నేతలు ముంబయికి వెళ్లి రెబల్ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపే అవకాశముందని తెలుస్తోంది.
ఇదివరకే రెబల్ ఎమ్మెల్యేలను పలుమార్లు బుజ్జగించినప్పటకీ ఫలించలేదు. ఈ తరుణంలో కీలకమైన విశ్వాస పరీక్షకు ముందు జరపాలని భావిస్తున్న మంతనాలు సఫలమయ్యేనో లేదో చూడాలి.
ఎవరితోనూ భేటీ వద్దు...
కాంగ్రెస్ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని.. అందుకే మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్‌తో పాటు ఎవరితోనూ భేటీ అవ్వాలనే ఆలోచనే లేదని ముంబయిలో ఉంటున్న రెబల్ నేతలు ఇదివరకే పోలీసులకు లేఖ రాశారు.
గురువారం ఉదయం 11 గంటలకు...
సోమవారం కర్ణాటక శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు బీఏసీ సమావేశమైంది. ఈ భేటీలో బలపరీక్ష కోసం ఒత్తిడి తెచ్చింది భాజపా. సుప్రీం కోర్టు విచారణ తర్వాత.. నిర్ణయం తీసుకుందామని సభ్యులకు సూచించారు స్పీకర్. అయితే.. ఎంతకూ తగ్గని కాషాయ పార్టీ.. అవిశ్వాస తీర్మాన నోటీసును స్పీకర్‌కు అందించింది. చివరకు.. ఈ నెల 18న సీఎం విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు సభాపతి. అనంతరం.. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య దీనిపై స్పష్టతనిచ్చారు. 18న ఉదయం 11 గంటలకు విశ్వాస పరీక్షపై చర్చ ప్రారంభమవుతుందని వెల్లడించారు.