కర్ణాటక రాజకీయ సంక్షోభంలో బుజ్జగింపుల పర్వం జోరందుకుంది. అసమ్మతి ఎమ్మెల్యేలను దారికి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు తెరచాటు మంతనాలు ముమ్మరం చేశారు. ఈ ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి.
ట్రబుల్ షూటింగ్...
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, జలవనరులశాఖ మంత్రి డి.కె.శివకుమార్... ఇవాళ ఉదయం 5 గంటలకే మంత్రి ఎంటీబీ నాగరాజ్ నివాసానికి చేరుకున్నారు. దాదాపు నాలుగున్నర గంటలపాటు ఆయనతో చర్చలు జరిపారు. మంత్రి పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవాలని సూచించారు. ఉపముఖ్యమంత్రి పరమేశ్వర కూడా నాగరాజ్ నివాసానికి వెళ్లి ఆయన్ను శాంతింపజేయడానికి ప్రయత్నించారు.
చర్చలు సఫలమయ్యాయని భేటీ అనంతరం శివకుమార్ తెలిపారు. నాగరాజ్ రాజీనామా ఉపసంహరించుకోవడానికి అంగీకరించారని ప్రకటించారు.
మిగిలిన వారితోనూ...
ఇదే రీతిలో అసమ్మతి ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, ముణిరత్న, రోషన్ బేగ్నూ బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కుమారస్వామి నేరుగా వీరితో మంతనాలు జరుపుతున్నారని సమాచారం.
రిసార్ట్ రాజకీయాలు
బలనిరూపణకు సిద్ధమని ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. వచ్చే వారం విశ్వాస పరీక్ష జరిగే అవకాశముంది. ముందుజాగ్రత్తగా కాంగ్రెస్, భాజపా తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించారు. ఎవరూ పార్టీ నుంచి జారిపోకుండా వేయి కళ్లతో కాపాడుకుంటున్నారు.
ఇదీ చూడండి: వైరల్: బాలీవుడ్ పాట బ్యాక్గ్రౌండ్తో పోలీసుల కవాతు