కర్ణాటకకు చెందిన ఓ కళాకారుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తల్లితో కలిసి ఉన్న చిత్రాన్ని చూడముచ్చటగా తీర్చిదిద్దారు. కుందన్ కళ ద్వారా ఈ చిత్రాన్ని రూపొందించారు మైసూరుకు చెందిన భాను ప్రకాశ్. ఇందుకోసం సంవత్సరం పాటు కష్టపడ్డారు.
కుందన్ కళ అంటే?
చెక్కను చిన్నచిన్న ముక్కలుగా చేసి చిత్రాలను వేసే ప్రావీణ్యాన్నే కుందన్ కళ అంటారు. మరో 25 మంది కళాకారులతో కలిసి ఈ చిత్రపటాన్ని రూపొందించారు భాను ప్రకాశ్. 10 రకాల కలపను ఇందుకోసం వినియోగించారు. ఈ కళాఖండాన్ని సూరత్‌లో ప్రదర్శనకు పెట్టనున్నారు.
భాను ప్రకాశ్.. 11 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. లండన్‌లో నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేశారు. చిత్రలేఖనం, హస్తకళలపై మక్కువతో ఇంజినీరింగ్ వృత్తిని వదిలిపెట్టారు. కళా రంగంలో ప్రావీణ్యం సంపాదించి క్రాఫ్ట్ మెలాన్ అనే సంస్థను స్థాపించారు భాను.
ఎంతో చరిత్ర
కుందన్ కళకు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. మైసూరు మహారాజుల కాలంలో బాగా ప్రాచుర్యం లభించింది. ఆ సమయంలో మైసూరులో 2 వేలకుపైగా కుందన్ కళాకారులు ఉండేవారు. కానీ క్రమంగా కళకు ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇప్పుడు కర్ణాటకలో కేవలం 200 మంది కళాకారులే ఉన్నట్లు అంచనా.