జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ... చనిపోయిన తన కన్న కొడుకును వీడియో కాల్ ద్వారా చివరి చూపుచూసుకున్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లో జరిగింది. నిబంధనల ప్రకారం ఖైదీలు తమ కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి వీలులేనప్పటికీ... కాన్పూర్ జైలు అధికారులు మానవతా దృక్పథంతో వీడియో కాల్ ద్వారా ఆ అవకాశం కల్పించారు.
చివరి చూపు కోసం
అరవింద్ అనే వ్యక్తి కాన్పూర్ జైలులో ఖైదీగా ఉన్నాడు. ఆయన భార్య అంజలి. వీరి ఐదేళ్ల కుమారుడు అనారోగ్యంతో మరణించాడు. దీనితో ఆమె... కుమారుని అంత్యక్రియలు నిర్వహించేందుకు జైలులో ఉన్న అరవింద్‌ను అనుమతించాలని జైలు అధికారులను అభ్యర్థించింది.
అయితే నిబంధనల ప్రకారం ఖైదీకి పెరోల్ లేకుండా బయటకు పంపించడం సాధ్యపడదు. అందువల్ల జైలు అధికారులు అందుకు అనుమతించలేదు. దీనితో అంజలి తన బిడ్డ మృతదేహాన్ని నేరుగా జైలుకు తీసుకొచ్చింది. కనీసం బిడ్డను చివరిసారిగా చూసుకునేందుకైనా తన భర్తకు అవకాశం కల్పించాలని ప్రాధేయపడింది.
మనస్సు కరిగింది..
కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో.... ఖైదీలు, సందర్శకులు కలుసుకునేందుకు ప్రస్తుతం అనుమతించడంలేదు. దీనితో జైలు అధికారులు ఆమెను వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె పదేపదే ప్రాధేయపడింది.
దీనితో మనసు కరిగిన అధికారులు మానవతా దృక్పథంతో... వీడియో కాల్ ద్వారా తన బిడ్డను చివరిసారి చూసేకునేందుకు ఖైదీ అరవింద్‌కు అవకాశం కల్పించారు. ఫలితంగా ఆయన కడసారి తన బిడ్డను కనులారా చూసుకోగలిగాడు.
ఇదీ చూడండి: ఐసీయూలో ఆరోగ్య మంత్రి- పరిస్థితి విషమం