ఇటీవలే తమిళనాడు డీఎంకే ఎంపీ కనిమొళికి చెన్నై ఎయిర్పోర్టులో ఎదురైన అనుభవం దృష్ట్యా సీఐఎస్ఎఫ్ చర్యలకు పూనుకుంది. ఆంగ్లంతో పాటు స్థానిక భాష తెలిసిన సిబ్బందిని విమానాశ్రయాలలో మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే చెన్నై విమానాశ్రయంలో తమిళం తెలిసిన 25 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
గతంలో తనకు కూడా ఇదే తరహా అనుభవం ఎదురైందంటూ కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సైతం వ్యాఖ్యానించారు. దీంతో ఈ వివాదాన్ని ఇంతటితో ముంగిచే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీనియర్ అధికారులు తెలిపారు. ప్రయాణికులు సైతం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
మరోవైపు కనిమొళి చేసిన వ్యాఖ్యలను సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారి తప్పుబట్టారు.
"ఆగస్టు 9న కనిమొళితో సంభాషించిన అధికారిని విచారించాం. కనిమొళి ఆరోపించినట్లు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని సదరు అధికారి తెలిపారు. హిందీ కూడా భారతీయ భాషే అని మాత్రమే చెప్పినట్లు అధికారి వివరించారు."
-సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారి
డీఎంకే ఎంపీ కనిమొళికి చెన్నై విమానాశ్రయంలో ఇటీవల చేదు అనుభవం ఎదురైంది. తనకు హిందీ రాదని.. తమిళం లేదా ఆంగ్ల భాషలో మాట్లాడమని సీఐఎస్ఎఫ్ అధికారిని అభ్యర్థించగా.. తాను భారతీయురాలినా? కాదా? అని ఓ అధికారి ప్రశ్నించినట్లు కనిమొళి పేర్కొన్నారు. హిందీ వచ్చిన వారే భారతీయులని ఎప్పటి నుంచి పరిగణిస్తున్నారని కనిమొళి ప్రశ్నించారు. దీంతో బలవంతంగా హిందీని రుద్దుతున్నారనే విషయంపై మరోసారి చర్చ మొదలైంది.
ఇదీ చదవండి- '17వ కర్మపా సందర్శనకు అనుమతించండి'